యాడ్వెంట్‌ చేతికి సువెన్‌ ఫార్మా 

27 Dec, 2022 07:11 IST|Sakshi

ముంబై: దేశీ హెల్త్‌కేర్‌ కంపెనీ సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో మెజారిటీ వాటాను గ్లోబల్‌ పీఈ దిగ్గజం యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్‌ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది.

దీనిలో భాగంగా సువెన్‌ వాటాదారులకు యాడ్వెంట్‌ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్‌ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్‌ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయనుంది. ప్రస్తుతం సువెన్‌లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్‌తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. 

విలీనానికి ఆసక్తి 
పోర్ట్‌ఫోలియో కంపెనీ కోహేన్స్‌ను సువెన్‌లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్‌ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్‌ టు ఎండ్‌ కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్‌ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్‌ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్‌ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు  తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్‌ పిరియడ్‌ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు.  

2020లో విభజన.. 
మాతృ సంస్థ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నుంచి 2020లో సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్‌ రూ. 1,280 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్‌ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది.  ఈ వార్తల నేపథ్యంలో సువెన్‌ ఫార్మా షేరు  దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది.

ముఖ్య సలహాదారుగా.. 
డీల్‌ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్‌కేర్‌లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్‌ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్‌ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్‌తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్‌ కొనుగోలు ద్వారా బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్‌ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్‌ ఎండీ పంకజ్‌ పట్వారీ పేర్కొన్నారు. సువెన్‌ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్‌ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు.    

మరిన్ని వార్తలు