దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!

18 Mar, 2022 17:24 IST|Sakshi

2021లో మొత్తం గృహ అమ్మకాలలో రూ.45 లక్షల వరకు ధర గల చౌక గృహాలకు డిమాండ్ 48 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. అయితే, ఇందుకు విరుద్దంగా రూ.75 లక్షలకు పైగా విలువ గల గృహా అమ్మకాల వాటా 25 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ తెలిపింది. 'రియల్ ఇన్ సైట్ రెసిడెన్షియల్ - వార్షిక రౌండ్-అప్ 2021' పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రాప్ టైగర్ ఎనిమిది ప్రైమ్ హౌసింగ్ మార్కెట్లలో గృహ అమ్మకాలు 2021లో 13 శాతం పెరిగి 1,82,639 యూనిట్ల నుంచి 2,05,936 యూనిట్లకు పెరిగాయి. 

ప్రాప్ టైగర్ డేటా ప్రకారం, భారతదేశంలోని ఎనిమిది ప్రముఖ హౌసింగ్ మార్కెట్లలో మొత్తం హౌసింగ్ అమ్మకాల్లో 43 శాతం వాటా గల రూ.45 లక్షల విలువ చేసే గృహాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది రూ.45 లక్షలు-రూ.75 లక్షలు ధర గల గృహాల అమ్మకాల వాటా 2020లో ఉన్న 26 శాతం నుంచి 2021లో 27 శాతానికి పెరగగా, రూ.75 లక్షల నుంచి రూ.కోటి పరిధిలో ఉన్న అపార్ట్ మెంట్ల వాటా 9 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. కోటి రూపాయలకు పైగా ఖరీదు గల గృహ వాటా 16 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. 

దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్'కతా, ఢిల్లీ-ఎన్‌సీఆర్(గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ మరియు ఫరీదాబాద్), ఎమ్ఎమ్ఆర్(ముంబై, నవీ ముంబై & థానే), పూణే వంటి 8 నగరాలలో గృహాలకు అధిక డిమాండ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2021లో దేశంలో సరసమైన గృహాల ఆకర్షణకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు వల్ల గృహాలకు డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రాప్ టైగర్ అన్నారు. ఆదాయపు పన్ను చట్టం- 1960 సెక్షన్ 80ఈఈఏ కింద రూ.45 లక్షల వరకు విలువ గల గృహాలకు రూ.1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును అందిస్తుంది. అటువంటి రుణగ్రహీత ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎమ్ఎవై) కింద సబ్సిడీని కూడా క్లెయిం చేసుకోవచ్చు. 

(చదవండి: భారత్‌ ఇంధన అవసరాలను తీర్చనున్న ఇరాన్‌..!) 

మరిన్ని వార్తలు