Afghanistan: తాలిబన్ల నుంచి పొంచి ఉన్న మరో పెనుముప్పు..! అదే జరిగితే..అంతే సంగతులు..!

19 Aug, 2021 17:51 IST|Sakshi

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌ పూర్తిగా తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణభయంతో అఫ్ఘన్‌ విడిచివెళ్లేందుకు అనేక ప్రయత్నాలను చేస్తున్నారు. తాలిబన్ల రాకతో అఫ్ఘన్‌ పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. తాలిబన్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరో పెనుముప్పు అఫ్ఘన్‌ పౌరులను వెంటాడనుంది. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌...!)

అఫ్ఘన్‌ పౌరుల డేటా ప్రమాదంలో..
అఫ్ఘన్‌ పౌరుల బయోమెట్రిక్‌ డేటా భారీ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్ఘన్‌ పౌరుల బయోమెట్రిక్‌ డేటాను తాలిబన్లు యాక్సెస్‌ చేసే అవకాశం ఉన్నట్లు హ్యూమన్‌ రైట్స్‌ ఫస్ట్‌ సంస్థ ట్విటర్‌లో వెల్టడించింది. అంతేకాకుండా బయోమెట్రిక్‌ డేటా పరికరాలను కూడా తాలిబన్లు వశపరుచుకునే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. గతంలో అఫ్ఘన్‌ ప్రభుత్వం తమ దేశ పౌరుల డేటాను డిజిటలైజ్‌ చేసింది. అంతేకాకుండా అఫ్ఘన్‌ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అప్పటి ప్రభుత్వం డిజిటల్‌ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. దీంతో అఫ్ఘన్‌ పౌరుల బయోమెట్రిక్‌ డేటాలను తాలిబన్లు సేకరించే అవకాశం ఉంది. పలు అఫ్ఘన్‌ వ్యక్తులను టార్గెట్‌ చేయడానికి బయోమెట్రిక్‌ డేటా తాలిబన్లు వాడే అవకాశం ఉన్నట్లు హ్యూమన్‌ రైట్స్‌ ఫస్ట్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

హ్యూమన్ రైట్స్ ఫస్ట్ గ్రూప్ ట్విటర్‌లో.. అఫ్ఘన్‌ పౌరుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లతో డేటాబేస్ యాక్సెస్‌ను  తాలిబన్లు కలిగి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఒక సంస్థను ఉపయోగించి అఫ్ఘన్‌ పౌరుల బయోమెట్రిక్‌ డేటాతో వారి ఇంటర్నెట్‌ హిస్టరీలను చూసేందుకు అనేక ప్రయత్నాలను జరిపింది. తాలిబన్లకు విరుద్ధంగా చేసిన చర్యలను గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. వారిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు కూడా జరిపారు.

దేశం వీడినా వేటాడుతారు...!
ప్రస్తుతం అఫ్ఘన్‌ పౌరులు దేశాన్ని విడిచిపెట్టివెళ్లిన వారు ఇతర దేశాల్లో శరణార్థులుగా వారి ఊరు, పేర్లను మార్చుకొని తిరిగినా వారిని తాలిబన్లు వెంటాడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అఫ్ఘన్‌ పౌరుల బయోమెట్రిక్‌ డేటా తాలిబన్ల చేతికి వస్తే ఇది సాధ్యంకానుంది. బయోమెట్రిక్‌ డేటా అనేది మారడం అసలు జరగదు. తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి బయోమెట్రిక్‌ డేటాలు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ చీఫ్‌ టెక్నాలజీ వెల్టన్‌ చాంగ్‌ వెల్లడించారు.   (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)

>
మరిన్ని వార్తలు