దీనస్థితిలో అఫ్గన్‌ నేల.. ఆదుకోవాల్సింది ఎవరు?

27 Nov, 2021 14:16 IST|Sakshi

అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్‌ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది.  ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. 


గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్‌ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్‌ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్‌లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు.
 

బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం

ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్‌ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. 


ఫర్నీచర్‌ అమ్ముకుని మరీ.. 

ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్‌ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది.

 

ఆధారపడడం వల్లే!
అఫ్గనిస్తాన్‌ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్‌ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్‌ ఎయిడ్‌ (విదేశీ సాయం) అఫ్గన్‌ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్‌ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్‌ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్‌ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. 


ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్‌ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్‌ సెక్టార్‌.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్‌ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్‌ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్‌ పాలనలో అఫ్గన్‌ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. 


 
కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్‌ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్‌, ఖతర్‌, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్‌ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు.  

ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్‌ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్‌ యూనియన్‌లు.. అఫ్గన్‌ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు