అఫ్గన్‌పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్‌ ప్రభుత్వం

14 Dec, 2021 11:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Afghan Taliban Govt Needs US Help: దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ.. జనజీవనం ఆకలి కేకల దుస్థితికి చేరుకున్న తరుణంలో తాలిబన్‌ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. 


అఫ్గన్‌ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. వరుసగా అమెరికా, పొరుగు దేశాల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. అయితే ప్రతీ చర్చలో తమ ఆధిపత్యమే ప్రదర్శిస్తూ.. ఫలితంపై ఎటూ తేల్చకుండా వస్తున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్‌ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

సాయం కావాలి
ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్‌ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్‌ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘‘ఫారిన్‌ ఎయిడ్‌ (విదేశీ సాయం) అఫ్గన్‌ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, మేం అధికారం చేపట్టేనాటికే అఫ్గన్‌ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. 

..అఫ్గన్‌కు సంబంధించి 10 బిలియన్‌ డాలర్ల ఫండ్‌ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అది విడుదలయ్యేందుకు అన్నీ దేశాలు మాకు సహకరిస్తాయని భావిస్తున్నాం.  అఫ్గన్‌పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్‌ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలి. అఫ్గన్‌ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు.

 

ఇక తాలిబన్ల పాలనలో ఆడపిల్లలు, మహిళల అణచివేత కొనసాగుతోందన్న కథనాలను కొట్టిపారేసిన ముట్టాఖీ..  మత చట్టంలో కొన్ని సవరణలకు, వాటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలోనూ తాము సవరణలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారాయన.  ‘‘ముందు ప్రపంచం మాతో కలవాలి. మేం వాళ్లతో కలవాలి.  అప్పుడే కదా మాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో తెలిసేది’’ అని వ్యాఖ్యానించారాయన. 

చదవండి: ఏం మిగల్లేదు! అఫ్గన్‌ ఆర్తనాదాలు

తప్పులు ఒప్పుకుంటున్నాం
అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ(తాలిబన్‌) ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. అయితే వాటి గురించి చర్చించకుండా.. సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారాయన.  అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో.. మేం మాట నిలబెట్టుకున్నాం. నాటో, అమెరికా దళాలపై ఎటువంటి దాడులు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఐసిస్‌ చేసిన దాడుల్ని మేం చేసినట్లుగా అనుమానించారు. ఆపై మా నిజాయితీ నిరూపించుకున్నాం. ప్రతీకార దాడుల కథనాలు కూడా ఊహాగానాలే!. ఏదిఏమైనా శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం. అందుకు అఫ్గన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యం పై ఉందని ఆయన పేర్కొన్నారాయన. 

‘‘అమెరికా సంయుక్త బలగాల ఉపసంహరణ తర్వాత అప్గన్‌.. దారుణంగా దెబ్బతింది. అది కోలుకోవాలంటే తిరిగి అమెరికా చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి. పొరపచ్చాలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్‌నిస్థాన్‌ బాగుపడేది అని ఆశాబావం వ్యక్తం చేశారాయన. అయితే ఐసిస్‌ వ్యతిరేక పోరాటంలో అమెరికాకు మద్ధతుగా నిలుస్తారా? అనే ప్రశ్నకు మాత్రం అమిర్‌ ఖాన్‌ దాటవేత ధోరణి ప్రదర్శించడం కొసమెరుపు.

చదవండి: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం..

మరిన్ని వార్తలు