ఐటీలో ఫేక్‌ కలకలం.. యాక్సెంచర్‌ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!

10 Nov, 2022 16:03 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం న‌కిలీ ప‌త్రాలు, ఫేక్ ఎక్స్‌పీరియ‌న్స్ లెట‌ర్స్‌ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్‌ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ సైతం చేరింది. 


యాక్సెంచర్‌ బాటలో కాగ్నిజెంట్‌..

తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్‌ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ ప‌త్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొల‌గించిన‌ట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు.

సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు.  ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు.

అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్‌స్టాప్‌ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.

చదవండి: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!

మరిన్ని వార్తలు