Disney Layoffs: ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!

12 Nov, 2022 19:18 IST|Sakshi

అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాం‍ద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.  ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా  స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన,  అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్‌ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

మరిన్ని వార్తలు