-

కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి.. ఎవరో తెలుసా?

27 Nov, 2023 10:44 IST|Sakshi

చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి బిలియనీర్ జాబితాలోకి చేరాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఇతని వల్ల చంద్రయాన్-3కు ఉపయోగం ఏమిటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.

కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్ 'రమేష్ కున్హికన్నన్' (Ramesh Kunhikannan) చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించారు. రోవర్, ల్యాండర్ రెండింటికీ అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను అందించి చంద్ర మిషన్ విజయంలో భాగస్వామి అయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కేన్స్ షేర్లు విపరీతంగా పెరిగాయి.

కేన్స్ షేర్లు భారీగా పెరగటం వల్ల కంపెనీలో 64 శాతం వాటా కలిగిన కున్హికన్నన్ ఆస్తులు తారాస్థాయికి చేరి బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచాడు. ఈయన మొత్తం సంపద 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. వంద కోట్లు కంటే ఎక్కువ. 

కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతుందని ఫోర్బ్స్ నివేదించింది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరఫరా చేస్తుంది.

మేక్ ఇన్ ఇండియా వల్ల లాభం
మైసూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కున్హికన్నన్ 1988లో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా కేన్స్‌ను స్థాపించారు. అతని భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం సంస్థ చైర్‌పర్సన్‌గా ఉంది. స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేన్స్ ఇండియాకు చాలా ఉపయోగపడింది.

ఇదీ చదవండి: భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్‌ఇన్ సంచలన రిపోర్ట్!

భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు