యాపిల్‌: వివాదాస్పద ఐఫోన్‌ ప్లాంట్‌ మళ్లీ ఓపెన్‌

10 Jan, 2022 10:14 IST|Sakshi

యాపిల్‌ కంపెనీ సప్లయిర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్‌, తమిళనాడులోని వివాదాస్పద ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జనవరి 12న ఈ ప్లాంట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుందని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు అధికారులు సైతం ప్రకటించడం విశేషం.   


శ్రీ పెరుంబుదూర్‌లో ఉన్న ఈ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ సెంటర్‌ బయట ఉన్న ఓ వసతి గృహంలో ఆహారం కల్తీ కావడంతో సుమారు 159 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రోడ్డెక్కిన ఉద్యోగులు భారీ ఎత్తున్న ఆందోళన చేపట్టగా.. ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాక్స్‌కాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాణాలకు తగ్గట్లు వసతి గృహాలు లేవనే ఆరోపణల్ని సైతం ఒప్పుకుంది.

 

2021 డిసెంబర్‌ 18న ఈ ఘటన జరగ్గా..  డిసెంబర్‌ 30నే తిరిగి ప్లాంట్‌ను తెరవాల్సి ఉంది. అయితే ప్రమాణాలు మెరుగుపర్చడం అనే కారణంతో నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసింది ఫాక్స్‌కాన్‌. ఈ లోపు యాజమాన్యాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు మూతపడిన కాలానికి జీతాలు సైతం చెల్లించింది. 

ఇదీ చదవండి: ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా!

మరిన్ని వార్తలు