మారుతి సుజూకి కార్ల ధరల పెంపు.. నేటి నుంచి అమలు

6 Sep, 2021 11:58 IST|Sakshi

దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి మరోసారి షాక్‌ ఇచ్చింది. తమ కంపెనీ నుంచి వస్తోన్న కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ తెలిపింది. 

1.9 శాతం పెరుగుదల
మైలేజీ, మెయింటనెన్స్‌ విషయంలో మారుతి బ్రాండ్‌కి మార్కెట్‌లో మంచి ఇమేజ్‌ ఉంది. దీంతో ఎక్కువ మంది మారుతి కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి వారికి మారుతి సంస్థ చేదు వార్తను తెలిపింది. ఒక్క సెలేరియో మోడల్‌ మినహా ఆల్టో నుంచి ఎస్‌ క్రాస్‌ వరకు అన్ని రకాల మోడళ్ల ఎక్స్‌షోరూమ్‌ ధరను 1.90 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం సెప్టెంబరు 6 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ముడి పదార్థాలే కారణం
కోవిడ్‌ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. ఈ తరుణంలో ధరలు పెంచాలని మారుతి నిర్ణయం తీసుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్‌ల ధరలు బాగా పెరగడమే కారణంగా కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఏదాడి వ్యవధిలో స్టీలు ధర కేజీ రూ.38 నుంచి రూ. 65కి పెరగగా రోడియం ధర గ్రాము రూ. 18,000ల నుంచి రూ. 64,300లకు పెరిగింది. ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కార్ల ధరను పెంచడం మినహా మార్గం లేకుండా పోయిందని మారుతి సుజూకి ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ అన్నారు.

మూడోసారి
వివిధ కారణాలు పేర్కొంటూ మారుతి సంస్థ ఈ ఏడాదిలో మూడు సార్లు కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది ఆరంభంలో ఒకసారి జనవరిలో ధరలు పెంచగా ఏప్రిల్‌లో రెండోసారి వాటిని సవరించింది. తాజాగా ఒకేసారి కార్ల ధరలను 1.90 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ ఏడాదిలో మారుతి కార్ల ధరలు 3.50 శాతం పెరిగాయి.

చదవండి: పండుగ సీజన్‌పై ఆటో కంపెనీల ఆశలు

మరిన్ని వార్తలు