ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ ఐపీవో 19న

14 Jan, 2022 02:32 IST|Sakshi

న్యూఢిల్లీ: పేమెంట్‌ సొల్యూషన్స్‌ అందించే ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభంకానుంది. 21న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 680 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే తొలుత రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని వేసిన ప్రణాళికలను తాజాగా సవరించుకుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌తోపాటు, ప్రస్తుత వాటాదారులు రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్‌ రవి బి.గోయల్‌ రూ. 677 కోట్లకుపైగా విలువైన షేర్లను ఆఫర్‌ చేయనున్నారు.

తొలుత రూ. 792 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించాలని ప్రణాళికలు వేయడం గమనార్హం. కాగా.. కంపెనీ సమీకృత ఓమ్నీ చానల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, కార్పొరేట్లకు డిజిటల్, నగదు ఆధారిత సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. ఇంతక్రితం 2015లో ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ రూ. 1,350 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2018లో ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందింది. అయితే ఈ ప్రణాళికలను అమలు చేయలేదు.

మరిన్ని వార్తలు