పండుగ సీజన్‌: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌

23 Aug, 2022 10:35 IST|Sakshi

నిధుల సమీకరణ వ్యూహం

డిపాజిట్‌ రేట్ల పెంపు 6 శాతం వరకూ అప్‌

పండుగల సీజన్‌ రుణ డిమాండ్‌ ఎదుర్కొనే ప్రణాళిక  

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో రుణ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకుగాను నిధుల సమీకరణ బాటలో బ్యాంకింగ్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రిటైల్‌ డిపాజిటర్లను (రూ.2 కోట్ల లోపు) ఆకర్షించడానికి పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. బ్యాంకింగ్‌ దిగ్గజం  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్‌సహా పలు బ్యాంకులు నిర్దిష్ట కాలానికి వర్తించేలా తమ డిపాజిట్‌ రేట్లను ఆరు శాతం ఆపైకి పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి.  భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  కొన్ని బ్యాంకులు రేట్ల పెంపునకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే...  

(చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్‌)
ఎస్‌బీఐ: 1000 రోజుల కాలపరిమతికి సంబంధించి డిపాజిట్‌ రేటును 6.10 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లు 50 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌ 30 వరకూ ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుందని తెలిపింది.  
కెనరా బ్యాంక్‌: 666 రోజుల కాలపరిమితికి రేటును 6 శాతానికి పెంచింది. 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: బరోడా తిరంగా డిపాజిట్‌ పథకం పేరుతో  ప్రత్యేక రిటైల్‌ టర్మ్‌ ప్లాన్‌ను ఆఫర్‌ చేసింది.  2022 డిసెంబర్‌ 31 వరకూ అందుబాటులో ఉండే విధంగా 444 రోజులు, 555 రోజుల రెండు కాలపరిమితులతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 444 రోజులకు 5.75 శాతం వడ్డీ, 555 రోజులకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.  
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: 1,111 రోజులు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ కాలపరిమితికి సంబంధించి 5.75 శాతం రేటుతో డిపాజిట్‌ పథకాన్ని అమలు చేస్తోంది.  
ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు: ప్రైవేటు రంగంలోని ఈ దిగ్గజ బ్యాంకులు పదేళ్ల వరకూ కాలపరిమతితో 5.75 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తూ, డిపాజిట్‌ పథకాన్ని వెలువరించాయి. 
యాక్సిస్‌ బ్యాంక్‌: 18 నెలల వరకూ డిపాజిట్‌పై 6.05 శాతం వడ్డీ ఆఫర్‌తో డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చింది. 

(ఇదీ చదవండి: Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్‌ విషయాలు)

ఆర్‌బీఐ రేటు పెంపు నేపథ్యం... 
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం  పెంచుతూ (5.40 శాతానికి అప్‌) ఈ నెల 5వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌సహా పలు రుణసంస్థలు తమ డిపాజిట్‌ రేట్లను పెంచాయి. డిపాజిట్‌రేట్లతో పాలు పలు బ్యాంకులు రుణ రేట్ల పెంపును కూడా ప్రారంభించాయి. వడ్డీరేట్లకు సంబంధించి సవాళ్లను నిర్వహించే స్థితిలో ప్రస్తుతం బ్యాంకింగ్‌ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కీలక వ్యాఖ్యలు  చేస్తూ, ‘‘రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్‌ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాలవు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్‌ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపాజిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది’’ అని బ్యాంకింగ్‌కు స్పష్టం చేయడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు