అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు

26 Sep, 2021 13:49 IST|Sakshi

చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు నగరాలకు వచ్చే అమ్మాయిలు, మహిళలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఒంటరి మహిళలు, పెళ్లికాని అమ్మాయిలకు ఇళ్లు ఇవ్వమంటూ అపార్ట్‌మెంట్‌ సొసైటీలు విద్యార్థినులు, లేడీ ఎంప్లాయిస్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం అమ్మాయిలు ధరించే దుస్తులు సరిగా లేవన్న కారణంతో ఈ దారుణానికి అపార్ట్‌మెంట్‌ సొసైటీ సభ్యులు తెగబడుతున్నారు. 


కోవిడ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంత కాలం ఇళ్లకే పరిమితమై వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఉన్నత విద్య కోసం గ్రామాలను వదిలిన విద్యార్థినులు నగరాల బాట పడుతున్నారు. అయితే ఇలా వస్తున్న మహిళల పట్ల కొందరు ఛాందసవాదులు పెడుతున్న రూల్స్‌ ఇబ్బందికరంగా మారుతున్నాయి. 

అహ్మదాబాద్‌లో
వ్యాపార వాణిజ్య రంగాల్లో మెట్రో నగరాల సరసన చేరేందుకు వడివడిగా అడుగులు వస్తోంది అహ్మదాబాద్‌. ఈ నగరంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల కార్పొరేట్‌ ఆఫీసులు, జాతీయస్థాయి విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పని చేసేందుకు, చదువుకునేందుకు గుజరాత్‌ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చాలా మంది అహ్మదాబాద్‌ చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో పేయింగ్‌ గెస్టులుగా, ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో అద్దెకు ఉంటున్నారు. నిన్నామొన్నటి వరకు ఇలా ఉండే వారికి ఏ ఇబ్బందులు లేవు, కానీ తాజాగా అమ్మాయిలు, మహిళలను టార్గెట్‌గా చేసుకుని కొత్త రూల్స్‌ పెడుతున్నారు. 

అమ్మాయిలకు ఇవ్వం
అహ్మదాబాద్‌లో గత కొద్ది కాలంగా చాపకింద నీరులా కొత్త రకం ప్రచారం తెరపైకి తెచ్చారు. పెళ్లైన జంటలకే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి తప్పితే సింగిల్‌గా ఉండే అమ్మాయిలు, మహిళలకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దంటూ ప్రచారం ప్రారంభించారు. కనీసం పెయింగ్‌ గెస్టులుగా కూడా ఇళ్లలో ఉండనివ్వరాదంటూ హుకుం జారీ చేస్తున్నారు. చాలా మంది మౌనంగా ఈ ఇబ్బందులు పడుతున్నారు. కాదని ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఘటన అహ్మాదాబాద్‌ మిర్రర్‌లో ప్రచురితమైంది, దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బౌన్సర్లతో దాడులు
అహ్మదాబాద్‌లోని  వైష్ణోదేవీ ఏరియా సమీపంలో ఉన్న రత్నా పారడైజ్‌ అపార్ట్‌మెంట్‌ సొసైటీ సభ్యులు మహిళల పట్ల కఠిన ఆంక్షల విషయంలో మరింతగా దిగజారారు. తమ అపార్ట్‌మెంటులో ఉంటున్న నిర్మా యూనివర్సిటీ విద్యార్థినులను ఫ్లాట్‌ ఖాళీ చేయాలంటూ ఆగస్టు 27న ఆదేశించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బౌన్సర్లతో బెదిరించారు. కాలేజీ నుంచి అపార్ట్‌మెంట్‌కి వచ్చిన స్టూడెంట్స్‌ని గేటు దగ్గరే గంటల తరబడి నిలబెట్టారు. వర్షంలో తడుస్తున్నా లోనికి రానివ్వలేదు. 

పోలీస్‌ స్టేషన్‌లో అదే తీరు
సోసైటీ సభ్యుల వేధింపులను ఆ విద్యార్థినులు ప్లాట్‌ యజామాని యోగేష్‌ పటేల్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోసైటీ సభ్యుల తీరుని ప్లాట్‌ యజమాని ఖండించగా మరుసటి రోజు బౌన్సర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీ ఆఫీసులో జరిగిన ఘటనపై అతను ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఆగస్టు 29న యోగేష్‌ పటేల్‌కి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి పిలుపు వచ్చింది. అతనిపై నాలుగు ఫిర్యాదు వచ్చాయని, వాటిపై విచారణ చేయాలంటూ.. యోగేష్‌ పటేల్‌తో పాటు అతని భార్యా పిల్లలను ఆ  రోజంతా స్టేషన్‌లోనే ఉంచారు. చివరకు సొసైటీపై రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.

మమ్మల్నీ ఇబ్బంది పెట్టేందుకే
మా సొసైటీలో బ్యాచ్‌లర్స్‌కి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని ముందే చెప్పాం. కానీ యోగేష్‌ పటేల్‌ ఆ నిబంధన ఉల్లంఘించాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మరో సొసైటీ మెంబర్‌ కరణ్‌ కియాని అంటున్నారు.

వాళ్ల దుస్తులు బాగాలేవు
నిర్మా యూనివర్సిటీ విద్యార్థులతో మాకు ఏ సమస్యా లేదు. అయితే అప్పుడప్పుడు వారు ధరించే దుస్తులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి దుస్తులతో వారు అపార్ట్‌మెంట్‌లో తిరగడం మాకు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ఖాళీ చేయమని కోరుతున్నాం అంటూ అరుణ్‌ జోషి అనే సొసైటీ మెంబర్‌ మీడియాకు తెలిపారు. 


ఇంకెక్కడ భద్రత 
రత్నా సొసైటీలోని ప్లాట్స్‌లో నేను అమ్మాయితో పాటే ఉంటున్నాను. తనకు కాలేజీకి వెళ్లడం, ఇంటికి వచ్చి చదువుకోవడం తప్ప మరో ధ్యాసే ఉండదు. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ప్లాటఠ్‌ ఖాళీ చేయమనడం ఎంత వరకు సబబు. ఫుల్‌ సెక్యూరిటీ ఉండే అపార్ట్‌మెంట్‌లోనే మాకు రక్షణ లేకుండా ఇంకా ఎక్కడ దొరకుతుంది అంటూ బాధిత విద్యార్థినుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 
డీజీపీకి చేరిన పంచాయతీ
తమను ఇళ్లు ఖాళీ చేయించేందుకు పారడైజ్‌ అపార్ట్‌మెంట్‌ సొసైటీ బలవంతం చేయడంపై బాధిత విద్యార్థినులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిర్మా యూనివర్సిటీలో విద్యార్థులు అందరికీ సరిపడ వసతి లేదని, అందువల్లే తాము బయట ప్లాట్‌లో ఉంటూ చదువుకుంటున్నామని వివరించారు. ఇప్పుడు బలవంతంగా తమను ప్లాట్‌ ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. తమను బెదిరించిన బౌన్సర్లు, ఇబ్బంది పెడుతున్న సొసైటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

రియల్‌టర్ల ఆందోళన
పెద్ద నగరాల్లో అపార్ట్‌మెంట్ల అద్దె అనేది ఎంతో ముఖ్యమైన బిజినెస్‌ అని.. కేవలం పెళ్లైన వారికే వాటిని అద్దెకు ఇవ్వాలంటూ నిబంధనలు పెడితే ఇళ్ల అమ్మకాలు పడిపోతాయని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో ఇండిపెండెంట్‌గా పని చేస్తున్న యువతులు అహ్మాదాబాద్‌కు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని చెబుతున్నారు.
- సాక్షి, వెబ్‌ ప్రత్యేకం
 

చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి

మరిన్ని వార్తలు