మండిపోతున్న ఎండలు.. దుమ్ము రేపుతున్న ఏసీల అమ్మకాలు

3 May, 2022 20:50 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక పోతున్నారు జనం. ఎన్నడూ లేనిది ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో సూర్యుడి వేడి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉన్న వారు ఎయిర్‌ కండీషనర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2022 ఏప్రిల్‌లో ఏసీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

2022 ఏప్రిల్‌లో ఎన్నడూ లేనంతగా 17.50 లక్షల ఏసీలు అమ్ముడైనట్టు కన్సుమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌​ అప్లయన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా) తెలిపింది. 2021 ఏడాదితో పోల్చితే అమ్మకాలు రెట్టింపు అయినట్టు వెల్లడించింది. జనాలందరూ ఇళ్లకే పరిమితమైన 2020తో పోల్చినా ఈ అమ్మకాలు ఎక్కువే నంటూ ప్రకటించింది.

ఈ ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి సీమా ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 85 లక్షల నుంచి 90 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. కానీ మార్చి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో ఏప్రిల్‌లో ఒక్కసారిగా అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో ఈ సీజన్‌ ముగిసే సరికి కోటికి పైగా ఏసీ యూనిట్లు అమ్ముడైపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్‌ కనుక మే, జూన్‌లలో కూడా కొనసాగితే మార్కెట్‌లో ఉన్న అన్ని ఏసీ యూనిట్లు అమ​‍్ముడై అవుటాఫ్‌ స్టాక్‌ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంటున్నారు.

మిగిలిన అన్ని విభాగాల మాదిరిగానే ఏసీలకు కూడా చిప్‌ సెట్ల కొరత, ఇతర ముడి పదార్థాల సరఫరా సమస్య ఎదురవులోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ తగ్గక పోతే ఏసీ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉందని సీమా అంటోంది. గడిచిన రెండేళ్లలో ఏసీల ధరలు 15 శాతం మేర పెరిగినా డిమాండ్‌ ఏమాత్రం తగ్గకపోవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. 

చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త!

మరిన్ని వార్తలు