AirIndia Deal: యూకే పీఎం రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

15 Feb, 2023 12:33 IST|Sakshi

ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థలతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆయా దేశాల అధినేతలు స్పందించారు. బ్రిటన్‌కు చెందిన రోల్స్‌ రాయిస్‌, ఎయిరిండియా మధ్య జరిగిన డీల్‌ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని యూకే ప్రధాని రిషి సుకాక్‌ అభివర్ణించారు. 

టాటా నేతృత్వంలోని ఎయిరిండియా అమెరికాకు చెందిన బోయింగ్‌, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ సంస్థలతో అతిపెద్ద డీల్‌ కుదుర్చుకుంది. వాటి నుంచి మొత్తం 470 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన రోల్స్‌ రాయిస్‌ నుంచి కూడా ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది.

ఈ మేరకు లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో రిషి సునాక్‌.. ఎయిరిండియా, ఎయిర్‌బస్‌, రోల్స్‌రాయిస్‌ల మధ్య  జరిగిన డీల్స్‌ యూకే ఏరోస్పేస్‌ రంగానికి హద్దులు లేకుండా చేశాయన్నారు. ఎయిర్‌బస్‌ విమానాల రెక్కలను యూకేలోనే తయారు చేస్తుందని, అలాగే ఏ350 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌కు రోల్స్‌ రాయిస్‌ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్లను సమకూర్చుతుందన్నారు. ఎయిరిండియా డీల్‌తో యూకే ఏరోస్పేస్‌ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 2050 కల్లా భారత్‌ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.

(ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్‌ నుంచి తొలి ‘ఫిన్‌’ డెలివరీ) 

మరోవైపు ఎయిరిండియా డీల్‌పై యూఎస్‌ ప్రెసిడెంట్‌ జోబైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మైక్రాన్‌ కూడా స్పందన తెలియజేశారు. ఎయిరిండియాతో ఒ‍ప్పందం అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో ఎయిరిండియాకు ట్రాన్స్‌పోర్టేషన్‌ డిమాండ్లు తీరుతాయని వైట్‌హౌస్‌ తెలియజేసింది. ఎయిరిండియా-ఎయిర్‌బస్‌ ఒ‍ప్పందం ఇండియా-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్‌ మైక్రాన్‌ ట్విటర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు