ఎయిరిండియాకు భారీ షాక్‌

9 Jan, 2023 21:14 IST|Sakshi

ఎయిరిండియాకు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిరిండియా విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 26న మద్యం మత్తులో ఉన్న శంకర్‌ మిశ్రా ఎయిరిండియా న్యూయార్క్‌ - ఢిల్లీ విమాన ప్రయాణంలో వృద్ద మహిళపై మూత్రం పోయడం కలకలం రేపింది. దీంతో ఎయిరిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. 

తాజా డీజీసీఏ ఎయిరిండియాకు పంపిన నోటీసుల్లో.. నవంబర్‌ 26న శంకర్‌ మిశ్రా మహిళపై మూత్రం పోశాడు. డిసెంబరు 6న పారిస్ - న్యూఢిల్లీ విమానంలో మద్యం సేవించిన ప్రయాణికుడు ఖాళీగా ఉన్న సీటు, మహిళా దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. మరొకరు మద్యం సేవించి లావేటరీ(ఫ్లైట్‌ బాత్రూం)లో సిగరెట్‌ తాగుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలపై ఎయిరిండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆలస్యంగా స్పందించడంపై మండిపడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్‌ చేసింది. 

పారిస్ విమానంలో జరిగిన ఘటనలపై డీజీసీఏ నివేదిక కోరిన తర్వాత మాత్రమే ఏం జరిగిందో చెప్పింది. అంతే తప్పా వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరిగినప్పుడు విమానయాన సంస్థ ఏదైనా సంఘటనను 12 గంటల్లోగా నివేదించడమే కాకుండా, వాటిని అంతర్గత కమిటీకి కూడా పంపాలని డీజీసీఏ తెలిపింది.

 కమిటీలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఛైర్మన్‌గా ఉండాలి. వేరొక షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌కు చెందిన ప్రతినిధి సభ్యుడు, ప్రయాణీకుల సంఘం లేదా వినియోగదారుల సంఘం నుండి ప్రతినిధి లేదా వినియోగదారు వివాద పరిష్కార ఫోరమ్‌కు చెందిన రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ అవేం చేయకుండా ఎయిరిండియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

చదవండి👉 వాట్సాప్‌ చాట్‌ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్‌ మిశ్రాను ఇరికించారా?

మరిన్ని వార్తలు