Air India: ఎయిరిండియాకు ‘ప్రాధాన్యత’ ఉపసంహరణ!

26 Apr, 2022 14:58 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఎయిరిండియాకు ఇస్తున్న ప్రాధాన్యతను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఉపసంహరించింది. ఎయిరిండియాకు ఇచ్చిన ట్రాఫిక్‌ హక్కులను ఇతర సంస్థలకు కేటాయించే ముందు.. కంపెనీ సమర్పించే ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తామంటూ గత సర్క్యులర్‌లో పొందుపర్చిన నిబంధనను తాజాగా ఏప్రిల్‌ 19న జారీ చేసిన సర్క్యులర్‌లో తొలగించింది.

పౌర విమాయాన రంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏ ఎయిర్‌లైన్స్‌కైనా సదరు హక్కులను కేటాయిస్తామని పేర్కొంది. సాధారణంగా ఒక దేశ విమానయాన సంస్థలు మరో దేశానికి సర్వీసులు నడపాలంటే ఇరు దేశాలు చర్చించుకుని, ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. దానికి అనుగుణంగా ఆయా దేశాలు తమ ఎయిర్‌లైన్స్‌కి సర్వీసులు హక్కులను కేటాయిస్తాయి.

ఎయిరిండియా ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఉండటంతో ఈ హక్కుల విషయంలో దానికి ప్రాధాన్యత లభించేది. కానీ ప్రస్తుతం టాటా గ్రూప్‌ చేతికి వెళ్లి ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌గా మారడం వల్ల ప్రత్యేక హోదా కోల్పోయింది.

మరిన్ని వార్తలు