Air India: ఉద్యోగులకు బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌ ఇండియా.. దాదాపు 8 వేల మందికి

26 Jan, 2023 11:34 IST|Sakshi

ముంబై/న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగులకు స్టాక్‌ ఆప్షన్‌ ఆఫర్‌ ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ‘ఎంప్లాయీస్‌ షేర్‌ బెనిఫిట్‌ (ఈఎస్‌బీ) స్కీమ్, 2022’ కింద 98 కోట్ల షేర్లను కేటాయించనుంది. 2022 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్‌ ఇండియా నియంత్రణ టాటా గ్రూపు చేతికి వెళ్లడం తెలిసిందే. ఈ స్టాక్‌ ఆప్షన్‌ పథకం కింద 8,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నట్టు ఎయిర్‌ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు.

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చేసుకున్న షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ప్రైవేటీకరించే నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్‌ బెనిఫిట్‌ పథకాన్ని ఆఫర్‌ చేసినట్టు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఇందులో ఉండే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు అందరికీ ఈ పథకం కింద అర్హత ఉంటుంది. కొనుగోలు చేసే నాటికి ఒక్కో షేరు పుస్తక విలువ 87–90 పైసలు ఉంటే, తాజా పథకంలో భాగంగా ఒక్కో స్టాక్‌ ఆప్షన్‌ను 27 పైసలకు ఆఫర్‌ చేసినట్టు తెలిసింది.

చదవండి: Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్‌ బడ్జెట్‌ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా!

మరిన్ని వార్తలు