ఎయిర్‌ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను

28 Apr, 2022 03:53 IST|Sakshi

కొనుగోలు డీల్‌కు అనుమతుల కోసం సీసీఐకి దరఖాస్తు

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్‌ఏషియా ఇండియాలో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్‌ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్‌ ఇటీవలే కొనుగోలు చేసింది.

వీటితో పాటు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్‌ సర్వీస్‌ ఎయిర్‌లైన్‌ విస్తారాను కూడా టాటా గ్రూప్‌ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్‌ చేసుకునే క్రమంలో ఎయిర్‌ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్‌ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు