రెండో దశకు ఎయిరిండియా విక్రయం 

14 Apr, 2021 08:12 IST|Sakshi

ఎయిరిండియా విక్రయం సెప్టెంబరు నాటికి

ఫైనాన్షియల్‌ బిడ్స్‌కు ఆహ్వానం!  

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి వీలుగా రెండో దశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్‌ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విక్రయ డీల్‌ సెప్టెంబర్‌కల్లా పూర్తికావచ్చని అంచనా వేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి టాటా గ్రూప్‌ సహా పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ బిడ్స్‌ దాఖలు చేయడం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌కల్లా ప్రాథమిక బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తికాగా.. వీటిని సమీక్షించిన ప్రభుత్వం అర్హతగల కంపెనీలను వీడీఆర్‌కు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు)

ఎయిరిండియా కొనుగోలులో భాగంగా ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చే వీడీఆర్‌కు బిడ్డర్స్‌ను అనుమతించినట్లు తెలుస్తోంది. వెరసి ఎయిరిండియా విక్రయం ఫైనాన్షియల్‌ బిడ్డింగ్‌ దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. 2007లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా మధ్య విలీనం జరిగాక కంపెనీ నష్టాలలో నడుస్తుండటం గమనార్హం! కాగా.. ప్రభుత్వం ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించనుంది. కొనుగోలుదారుడికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100శాతం వాటా, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్, కార్గో సేవలు అందించే ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50శాతం వాటా చొప్పున లభించనుంది. (మారుతీ దూకుడు: టాప్‌ సెల్లింగ్‌ కారు ఇదే!)
 

మరిన్ని వార్తలు