ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం

17 Feb, 2022 02:38 IST|Sakshi

టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌

ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్‌గ్రేడ్‌ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్‌ ప్రసంగంలో చంద్రశేఖరన్‌ ఈ విషయాలు చెప్పారు.

సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్‌ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్‌ వివరించారు. అత్యుత్తమ కస్టమర్‌ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐ–ఎస్‌ఏటీఎస్‌లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్‌ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు