విమాన టికెట్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తే రీయింబర్స్‌మెంట్‌

26 Jan, 2023 06:35 IST|Sakshi

ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్‌ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్‌ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్‌ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్‌ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్‌ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్‌ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్‌ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్‌ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు