ఎయిర్‌టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?

14 Jun, 2021 17:44 IST|Sakshi

గుర్గావ్‌: కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్‌టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా ఇతర నాలుగు భారతీయ టెలికం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రంను డీఓటి కేటాయించింది. 

1 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకున్న ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ దేశంలోని ఇతర ప్రాంతాలలో మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో 1 జీబీపీఎస్‌ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఎయిర్‌టెల్‌కు 5జీ ట్రయల్ కోసం 3500 మెగాహెర్ట్జ్, 28 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు 700 మెగాహెర్ట్జ్‌, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టిఎన్‌ఎల్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్‌వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో టీఎస్‌పీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా, రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ యొక్క వ్యవధి 6 నెలల మాత్రమే. ఇందులో పరికరాల సేకరణ, ఏర్పాటు కోసమే 2 నెలల పడుతుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఎస్‌ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్‌టెల్ నిలిచింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీలతో పోల్చినప్పుడు 5జీ 10x స్పీడ్స్, 10 ఎక్స్ లేటెన్సీ, 100 ఎక్స్ కంకరెన్సీని అందించగలదని గతంలో ఎయిర్‌టెల్ నిరూపించింది.

చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త!

మరిన్ని వార్తలు