జియోకు ఎయిర్‌టెల్‌ షాక్‌

24 Dec, 2020 16:30 IST|Sakshi

అక్టోబరులో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 36.7 లక్షలు

జియోకు 22.2 లక్షల కొత్త  చందాదారులు

మొత్తం టెలికం చందాదారులు 117 కోట్లు

సాక్షి, ముంబై: వరుసగా మూడవ నెలలో కూడా  టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ జియోకు షాకిచ్చింది. కొత వైర్‌లెస్ చందాదారులకు సంబంధించి  జియోను అధిగమించిన ఎయిర్‌టెల్‌ 36.7 లక్షలు కొత్త  యూజర్లను  సాధించింది. అయితే దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ  రిలయన్స్‌ జియో కొనసాగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎయిర్‌టెల్ అక్టోబర్‌లో 3.67 మిలియన్లకు పైగా కొత్త వైర్‌లెస్ చందాదారులను  సాధించి రిలయన్స్ జియోను అధిగమించింది.  జియో 2.22 మిలియన్ల చందాదారులతో పోలిస్తే ఎయిర్‌టెల్ 1.45 మిలియన్ల ఎక్కువ మందిని  తన ఖాతాలో వేసుకుంది. ఎయిర్‌టెల్ తన  నెట్‌వర్క్‌లో 96.74 శాతం క్రియాశీల చందాదారులు ఉన్నారు. (విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు)

అక్టోబరులో కొత్తగా ఎయిర్‌టెల్‌ 36.7 లక్షలు, జియో 22.2 లక్షల మంది మొబైల్‌ కస్టమర్లను దక్కించుకున్నాయి. వొడాఫోన్‌ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నూతన మొబైల్‌ కస్టమర్లను పొందలేకపోవడం గమనార్హం. వోడాఫోన్ ఐడియా (వి) 2.7 మిలియన్ల చందారులను కోల్పోయింది. సెప్టెంబరులో కూడా అత్యధికంగా కొత్త కస్టమర్లను ఎయిర్‌టెల్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.  సెప్టెంబరులో ఎయిర్టెల్ 3.8 మిలియన్ల చందాదారులను పొందగా, జియో 1.5 మిలియన్ల వినియోగదారులను చేర్చుకోగా, వోడాఫోన్ ఐడియా 4.6 మిలియన్ల మందిని కోల్పోయింది. అక్టోబర్ నాటికి అధికారిక సమాచారం ప్రకారం జియో  ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 406.36 మిలియన్లుగా ఉండగా, వొడాఫోన్‌ ఐడియాకు 292.84 మిలియన్ల చందాదారులున్నారు.

అటు దేశంలో టెలికం చందాదారుల సంఖ్య అక్టోబరు చివరినాటికి 117.18 కోట్లకు చేరింది. సెప్టెంబరులో ఈ సంఖ్య 116.86 కోట్లు. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో వైర్‌లెస్‌ కస్టమర్ల సంఖ్య 114.85 కోట్ల నుంచి 115.18 కోట్లకు ఎగసింది. వైర్‌లైన్‌ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య 2 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 1.99 కోట్లకు వచ్చి చేరింది. బ్రాడ్‌బ్యాండ్‌ చందాదార్లు 1.17 శాతం పెరిగి 73.48 కోట్లుగా ఉన్నారు. మొబైల్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్స్‌ 1.15 శాతం ఎగసి 71.26 కోట్లకు చేరారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు