సెకన్ల వ్యవధిలోనే సినిమా మొత్తం డౌన్‌లోడ్‌!

29 Jan, 2021 05:34 IST|Sakshi

5జీ సేవలకు నెట్‌వర్క్‌ సిద్ధం: ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులకు తమ నెట్‌వర్క్‌ సర్వం సిద్ధంగా ఉందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో లైవ్‌గా 5జీ నెట్‌వర్క్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వెల్లడించింది. యూజర్లు పూర్తి నిడివి సినిమాను 5జీ ఫోన్‌లో కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ చేసుకోగలిగినట్లు పేర్కొంది. తగినంత స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక, ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించిన తర్వాత పూర్తి స్థాయి సేవల అనుభూతిని కస్టమర్లకు అందించవచ్చని సంస్థ ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు, 5జీకి సంబంధించిన కీలక నెట్‌వర్క్‌ అంతా దేశీయమైనదే కావవాలని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ సర్వీసెస్‌ (ఎన్‌ఐసీఎస్‌ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. 2జీ, 3జీ, 4జీలో వెనుకబడినప్పటికీ 5జీ విషయంలో మాత్రం మిగతా దేశాల కన్నా భారత్‌ వేగంగా కొత్త టెక్నాలజీని అమలు చేయగలదని పేర్కొన్నారు.   

నవంబర్‌లో 43.7 లక్షల కొత్త యూజర్లు..
సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను పెంచుకునే విషయంలో దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరోమారు దుమ్మురేపింది. గతేడాది నవంబర్‌లో 43.7 లక్షల మంది కొత్త యూజర్లను సొంతం చేసుకున్న ట్రాయ్‌ గణాంకాలు తెలిపాయి. ఫలితంగా మొత్తం యూజర్ల సంఖ్య 33.46 కోట్లకు పెరిగింది. ఇదే నవంబర్‌లో తన సమీప ప్రత్యర్థి రిలయన్స్‌ జియో కూడా 19.36 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను దక్కించుకుంది. తద్వారా జియో మొత్తం యూజర్ల సంఖ్య 40.82 కోట్లకు పెరిగింది. నవంబర్‌లోనే 28.9 లక్షల మంది యూజర్లు వోడాఫోన్‌ ఐడియాకు గుడ్‌బై చెప్పడంతో కంపెనీ యూజర్ల బేస్‌ 28.99 కోట్లకు తగ్గింది.  దేశవ్యాప్తంగా టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్లు నవంబర్‌ నాటికి 1,175.27 మిలియన్లకు చేరుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు