ఎయిర్‌టెల్ మ‌రో రికార్డు.. అదేంటంటే!

2 Sep, 2021 17:32 IST|Sakshi

ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో రికార్డు సాధించింది. భారత దేశంలో 5జీ టెక్నాలజీ సహాయంతో మొట్ట మొదటి క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్(డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్ లో భాగంగా మనేసర్(గుర్గావ్)లో ఈ ప్రదర్శన నిర్వహించారు. గేమర్లు డెమో కోసం వన్ ప్లస్ 9ఆర్ మొబైల్ ఉపయోగించారు. ముఖ్యంగా, ఎయిర్‌టెల్‌ సీటీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. "వచ్చే ఏడాది మొదట్లో 5జీ రావచ్చు" అని ఆయన అన్నారు. 

ఎయిర్‌టెల్ నిర్వహించిన 5జీ క్లౌడ్ గేమింగ్ సమావేశంలో భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ గేమర్లు మోర్టల్(నమన్ మాథుర్), మాంబా(సల్మాన్ అహ్మద్)లు పాల్గొన్నారు. "ఈ స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ పీసీ, కన్సోల్ క్వాలిటీ గేమింగ్ ఆడిన అనుభవం కలిగింది. 5జీ నిజంగా భారతదేశంలో ఆన్ లైన్ గేమింగ్ ను అన్ లాక్ చేస్తుందని" అని గేమర్స్ అన్నారు. వీరు గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ కు కనెక్ట్ అయినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్ ప్రియులు హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ క్లౌడ్ గేమింగ్ ద్వారా రియల్ టైమ్ లో గేమ్స్ స్ట్రీమ్ చేయవచ్చు.(చదవండి: అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌!)

"భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. రోజు రోజుకి 5జీ విక్రయాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ గేమింగ్ $2.4 బిలియన్ మార్కెట్ గా అభివృద్ధి చెందనుంది. దేశంలో ఆన్ లైన్ గేమర్లు సంఖ్య 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది" అని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎయిర్‌టెల్‌ ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియాతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌ నగరంలో లైవ్‌గా 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు