ఎయిర్‌టెల్‌ బాదుడు షురూ!

23 Nov, 2021 02:30 IST|Sakshi

25 శాతం దాకా ప్రీపెయిడ్‌ టారిఫ్‌ల పెంపు

నవంబర్‌ 26 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా భారీ స్థాయిలో ప్రీపెయిడ్‌ ప్లాన్ల టారిఫ్‌లు పెంచింది. వాయిస్‌ ప్లాన్లు, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ బండిల్స్, డేటా టాప్‌–అప్‌లపై ఇది ఏకంగా 20–25 శాతం దాకా ఉంది. కొత్త రేట్లు నవంబర్‌ 26 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎంట్రీ స్థాయి వాయిస్‌ ప్లాన్‌ రేటు 25 శాతం పెరగ్గా, మిగతా చాలా మటుకు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ ప్లాన్లలో పెంపు సుమారు 20 శాతంగా ఉంది.

డేటా టాప్‌–అప్‌ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు 20–21 శాతంగా ఉంది. పెట్టుబడులపై సముచిత రాబడులు వచ్చి, వ్యాపార నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రతి మొబైల్‌ యూజర్‌పై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) కనీసం రూ. 200 స్థాయిలో, అంతిమంగా రూ. 300 స్థాయిలో ఉండాలని ముందు నుంచి తాము చెబుతున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.

‘ఏఆర్‌పీయూ మేము భావిస్తున్న స్థాయిలో ఉంటే నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రంపై గణనీయంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. అలాగే దేశీయంగా 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా సాధ్యమవుతుంది‘ అని ఎయిర్‌టెల్‌ వివరించింది. ఏఆర్‌పీయూ పెరగాల్సిన అవసరం ఉందని చాన్నాళ్లుగా చెబుతున్నప్పటికీ.. ఎయిర్‌టెల్‌ ఈ స్థాయిలో టారిఫ్‌లు పెంచడం ఇదే ప్రథమం. ఈ ఏడాది జూలైలోనే కంపెనీ కొంత మేర పెంచింది. అప్పట్లో రూ. 49 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ని తొలగించింది. ఈసారి మాత్రం పెంపు భారీగానే ఉంది.

రూ. 79 ప్లాన్‌.. ఇకపై రూ. 99..
► టారిఫ్డ్‌ వాయిస్‌ ప్లాన్లకు సంబంధించి ప్రస్తుతం రూ. 79గా ఉన్న ప్లాన్‌ రేటు ఇకపై రూ. 99గా ఉండనుంది (దాదాపు 25.3 శాతం పెంపు). ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్‌టైమ్‌ (50 శాతం అధికంగా), 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్‌ టారిఫ్‌ ఉంటుంది.  
► అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ ప్లాన్లలో రూ. 149 ప్లాన్‌ ధర రూ. 179కి పెరుగుతుంది. అలాగే రూ. 2,498 ప్లాన్‌ రూ. 2,999గా మారుతుంది.  
► డేటా టాప్‌ అప్‌ల విషయంలో రూ. 48 ప్లాన్‌ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్‌ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారుతుంది.
► రూ. 251 డేటా టాప్‌ అప్‌ ప్లాన్‌ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) మారుతుంది.

జియో, వొడాఐడియాపై దృష్టి..
ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో పోటీ సంస్థలైన రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా కూడా అదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్‌ల పెంపు కీలకమంటూ వొడాఫోన్‌ ఐడియా సీఈవో రవీందర టక్కర్‌ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. తమ కంపెనీ మొబైల్‌ టారిఫ్‌ల పెంపుపై కసరత్తు చేస్తోందని, త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు