ఎయిర్‌టెల్‌, జియో మధ్య ముగిసిన భారీ డీల్‌..!

13 Aug, 2021 18:28 IST|Sakshi

టెలికమ్యూనికేషన్స్‌ దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోల మధ్య కీలక ఒప్పందం ముగిసింది. టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మూడు సర్కిల్స్‌లో 800 Mhz ఎయిర్‌వేవ్‌ల(స్పెక్ట్రమ్‌)ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించే ఒప్పందం నేటితో ముగిసింది. రెండు దిగ్గజ టెలికాం ప్రత్యర్థుల మధ్య డీల్‌ జరగడం ఇదే మొదటిసారి. స్టాక్ ఎక్స్ఛేంజీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ తన మూడు సర్కిల్‌లలోని 800 MHz స్పెక్ట్రంను బదిలీ చేయడానికి రిలయన్స్ జియోతో తన వాణిజ్య ఒప్పందాన్ని ముగిసినట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ముంబై సర్కిళ్లోని ఎయిర్‌టెల్‌ 800Mhz స్పెక్ట్రమ్‌ను జియో పొందనుంది. ఒప్పందం ప్రకారం జియో ఎయిర్‌టెల్‌కు సుమారు రూ. 1004.8 కోట్లను ముట్టచెప్పింది. అంతేకాకుండా జియో అదనంగా స్పెక్ట్రమ్‌ బాధ్యతలు చేపట్టడానికి సుమారు రూ. 469. 3 కోట్లను ఎయిర్‌టెల్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్‌టెల్ తన 800 Mhz స్పెక్ట్రంను రిలయన్స్ జియోకు విక్రయించడానికి ఒక ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెగ్యులేటరీ చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎయిర్‌టెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో 3.75 Mhz, ఢిల్లీలో 1.25 Mhz ముంబైలో 2.5 Mhz బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను విక్రయించడానికి జియోకు ఆఫర్‌చేసింది. 
 

మరిన్ని వార్తలు