ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న జియో!

29 Jul, 2021 20:54 IST|Sakshi

భారతీయ టెలికాం మార్కెట్లో మే నెలలో ఎయిర్‌టెల్ 46.13 లక్షల చందాదారులను కోల్పోయింది. ట్రాయ్ విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం.. ఎయిర్‌టెల్ ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుంది. మొత్తం మీద మే నెలలో 62.7 లక్షల మంది భారత మొబైల్ మార్కెట్ వినియోగదారులు తగ్గారు. జియో ఈ నెలలో 35.54 లక్షల మొబైల్ వినియోగదారులను చేర్చుకొని మొత్తం చందాదారుల సంఖ్యను 43.12 కోట్లకు పెంచుకుంది. మే నెలలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ భారీగా చందాదారులను కోల్పోయాయి.

అలాగే, వోడాఫోన్ ఐడియాకు కూడా మే నెలలో 42.8 లక్షల మంది మొబైల్ చందాదారుల సంఖ్య తగ్గి, మొత్తం చందాదారుల సంఖ్య 27.7 కోట్లకు చేరుకుంది. ఎయిర్‌టెల్‌ 46.13 లక్షల మొబైల్ వినియోగదారులను కోల్పోయి, 34.8 కోట్ల చందాదారుల సంఖ్యతో మార్కెట్లో రెండవ అతిపెద్ద టెలికామ్ కంపెనీగా నిలిచింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మే నెలలో మొత్తం వినియోగదారుల సంఖ్య 62.7 లక్షలు తగ్గారు, ప్రస్తుతం దేశంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య 117.6 కోట్లు. ఏపీ & తెలంగాణలో కూడా 2021 మే నెలలో భారీగా చందాదారులను పొందిన ఏకైక ఆపరేటర్ జియోనే. ఏపీ & తెలంగాణలో 3,21,46,712 మంది వినియోగదారులతో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. జియో 46,119 మంది సభ్యులను చేర్చుకోగా, ఎయిర్‌టెల్ 4,08,257, వోడాఫోన్ ఐడియా 2,72,081 మంది వినియోగదారులను కోల్పోయాయి. అదే నెలలో బిఎస్‌ఎన్‌ఎల్ 4,15,690 మంది కస్టమర్లను కోల్పోయింది.

మరిన్ని వార్తలు