మరోసారి జియోను మించిన ఎయిర్‌టెల్‌

4 Dec, 2020 11:20 IST|Sakshi

సెప్టెంబర్‌లో కొత్త మొబైల్‌ వినియోగదారుల గణాంకాలు

ఎయిర్‌టెల్‌కు 3.8 మిలియన్లు- రిలయన్స్‌ జియోకు 1.5 మిలియన్లు

వొడాఫోన్‌ ఐడియా వెనకడుగు- ట్రాయ్‌ తాజా గణాంకాల వెల్లడి

మొబైల్‌ యూజర్ల సంఖ్యలో రిలయన్స్‌ జియోకు టాప్‌ ర్యాంకు

వైర్‌లైన్‌ విభాగంలో రిలయన్స్‌ జియో ముందంజ- టాప్‌లో ఎయిర్‌టెల్‌

ముంబై, సాక్షి: వరుసగా రెండో నెలలోనూ వైర్‌లెస్‌ వినియోగదారులను జత చేసుకోవడంలో మొబైల్‌ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ముందుంది.  గడిచిన సెప్టెంబర్‌లో 3.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను పొందింది. ఈ బాటలో రిలయన్స్‌ జియో 1.5 మిలియన్లమంది వినియోగదారులను కొత్తగా సంపాదించింది. రిలయన్స్‌ జియోతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్‌ రెట్టింపునకుపైగా యూజర్లను ఆకట్టుకోగలిగింది. వెరసి కొత్తగా కస్టమర్లను పొందడంలో వరుసగా రెండో నెలలోనూ జియోను మించిన స్పీడ్‌ను ఎయిర్‌టెల్‌ చూపింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. కాగా.. ఇటీవల పోటీలో వెనుకబడుతున్న వొడాఫోన్‌ ఐడియా మరోసారి వినియోగదారులను కోల్పోవడం గమనార్హం!

టాప్‌ ర్యాంకులో జియో
సెప్టెంబర్‌ చివరికల్లా రిలయన్స్‌ రిలయన్స్‌ జియో మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 0.36 శాతం పుంజుకుని 40.41 కోట్లను తాకింది. ఇక ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 1.17 శాతం వృద్ధితో 32.66 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ ఐడియా 4.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం ద్వారా 29.55 కోట్ల సంఖ్యకు పరిమితమైంది. దీంతో 35.1 శాతం మార్కెట్‌ వాటాతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలవగా.. 28.4 శాతం వాటాతో ఎయిర్‌టెల్‌ రెండో ర్యాంకును పొందింది. వొడాఫోన్‌ ఐడియా 25.7 శాతం మార్కెట్‌ వాటాతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకుంది.

వైర్‌లైన్‌ విభాగంలో
ట్రాయ్‌ వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో వైర్‌లైన్‌ విభాగంలో జియో 3,03,205 యూజర్లను, ఎయిర్‌టెల్‌ 66,335 వినియోగదారులనూ జత కలుపుకున్నాయి. దీంతో ఎయిర్‌టెల్‌ వైర్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య 4.4 మిలియన్లను తాకగా.. రిలయన్స్‌ జియో వైర్‌లైన్‌ సబ్‌స్క్రైయిబర్లు 2.1 మిలియన్లకు చేరింది. కాగా.. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య సెప్టెంబర్‌లో 1.4 శాతం వృద్ధితో 72.63 కోట్లకు చేరింది. ఈ విభాగంలో రిలయన్స్ జియో మార్కెట్‌ వాటా 55.9 శాతంకాగా.. 22.9 శాతంతో ఎయిర్‌టెల్‌ ద్వితీయ ర్యాంకులో నిలిచింది. వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ వాటా 16.5 శాతంగా నమోదైంది.

>
మరిన్ని వార్తలు