ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌, నెలకు రూ. 299 మాత్రమే

23 Jul, 2021 08:32 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా రూ. 299 నెలవారీ అద్దె వర్తించే ఎంట్రీ స్థాయి కార్పొరేట్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో డేటాను నెలకు 30 జీబీ (గతంలో 10 జీబీ)కి పెంచింది. కొన్ని కార్పొరేట్‌ ప్లాన్లు రూ. 299 కన్నా తక్కువకి ఉన్నాయని, నెల రోజుల నోటీసు తర్వాత వీటన్నింటిని రూ. 299 ప్లాన్‌కి అప్‌గ్రేడ్‌ చేయనున్నామని సంస్థ తెలిపింది. దీనితో ప్రతీ యూజరుపై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుందని పేర్కొంది.

రూ. 399 నెలవారీ అద్దె ప్లాన్‌ను ఉపయోగిస్తున్న కార్పొరేట్‌ కస్టమర్లకు డేటా పరిమితిని 50 జీబీ నుంచి 60 జీబీకి పెంచినట్లు, ట్రేస్‌మేట్‌ యాప్, గూగుల్‌ వర్క్‌స్పేస్, ఎయిర్‌టెల్‌ కాల్‌ మేనేజర్‌ వంటివి కూడా వీరికి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వివరించింది. అన్ని ప్లాన్లలోనూ ఇకపైనా వింక్‌ మ్యూజిక్‌ యాప్, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ యాప్‌ ప్రీమియం, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం షా అకాడమీకి ఏడాది పాటు యాక్సెస్‌ ఉంటుందని తెలిపింది. రూ. 499, రూ. 1,599 నెలవారీ రెంటల్‌ ఉండే హై–ఎండ్‌ కార్పొరేట్‌ ప్లాన్లలో వీఐపీ సర్వీస్‌ వంటివి కూడా జోడించినట్లు ఎయిర్‌టెల్‌ వివరించింది. 


 

మరిన్ని వార్తలు