వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్‌ బంగా ఎన్నిక లాంఛనమే!

31 Mar, 2023 08:41 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్‌ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తదుపరి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ల సమర్పణకు గడువు మార్చి 29తో ముగిసింది. బరిలో అజయ్‌ బంగా ఒక్కరే నిలిచారు. దీంతో వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. 

ఇతర అభ్యర్థులెవరూ నామినేట్ కానందున తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా నామినేషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో విజయవంతమైన సంస్థలకు నాయకత్వం వహించిన విస్తృత అనుభవం కలిగిన వ్యాపార నాయకుడైన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫిబ్రవరిలో ప్రకటించారు.

(ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు)

అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన మాస్టర్‌కార్డ్‌కు ప్రెసిడెంట్, సీఈవోగా చేశారు. సెంట్రల్ అమెరికా కోసం పార్టనర్‌షిప్ కో-చైర్‌గా వైస్ ప్రెసిడెంట్ హారిస్‌తో కలిసి పనిచేశారు.

ప్రపంచ బ్యాంక్‌ అధిపతిగా కాబోతున్న మొట్ట మొదటి భారతీయ అమెరికన్‌ అజయ్‌ బంగా ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవాల్సి ఉంది. అయితే ఆయనకు కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దయ్యాయి.

మహారాష్ట్రలోని పుణె నగరంలో జన్మించిన బంగా ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందారు. 2016లో అజయ్‌బంగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మరిన్ని వార్తలు