Akasa Air ఆఫర్‌: వారి సంబరం మామూలుగా లేదుగా!

6 Oct, 2022 13:20 IST|Sakshi

సాక్షి, ముంబై: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్‌ ఝన్‌ఝన్‌ వాలాకు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌  పెట్‌  లవర్స్‌కు శుభవార్త అందించింది. త్వరలోనే తమ విమానాల్లో పెట్స్‌ తో సహా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది.   

ఆకాశ ఎయిర్‌లైన్స్‌ తాజా ప్రకటన ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి  తన విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక వ్యక్తికి 7 కిలోల వరకు బరువు ఉన్న ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని విమానయాన సంస్థ తెలిపింది. "పెంపుడు జంతువుల పాలసీకి సంబంధించి ఇది తొలి అడుగు అని, ప్రస్తుతం పెంపుడు పిల్లులు , కుక్కలను అనుమతిస్తాం త్వరలోనే మరింత విస్తరిస్తామని’’ సంస్థ  ప్రకటించింది. 

ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను జోడిస్తున్నామని ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాపకుడు , సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 18 విమానాలు, రానున్న అయిదేళ్లలో 72 విమానాల  అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీంతో పెట్‌ లవర్స్‌  సోషల్‌ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు