Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..

16 Nov, 2021 18:48 IST|Sakshi

భారత బిలియనీర్‌ స్టాక్‌ మార్కెట్‌ నిపుణుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్‌ ఎయిర్‌లైన్‌ ‘ఆకాశ ఎయిర్‌’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్‌ఝున్‌వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్‌' బ్రాండ్‌ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు నేడు(నవంబర్ 16) ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. 

ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్ దుబే మాట్లాడుతూ కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. "ఈ కొత్త 737 మ్యాక్స్ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే మా లక్ష్యానికి మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి అని దుబే అన్నారు. 

ఆకాశ ఎయిర్‌ ప్రధాన ఉద్దేశ్యం భారతదేశం ఎదుగుదలకు శక్తిని అందించడంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని దుబే తెలిపారు. అకాసా ఎయిర్ ఆర్డర్ చేసిన వాటిలో రెండు వేరియెంట్లు ఉన్నాయి. అవి ఒకటి 737-8, రెండవది అధిక సామర్ధ్యం గల 737-8-200. బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే సృజనాత్మక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన ప్రాంతాలలో తక్కువ ధరకు సేవలను అందించడానికి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై నమ్మకాన్ని ఉంచిందుకు కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: పబ్‌జీ మొనగాళ్లకు షాక్‌..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్‌ అవుతుయ్‌..!)

మరిన్ని వార్తలు