‘టైమ్‌100’లో ఆకాశ్‌ అంబానీ

29 Sep, 2022 04:49 IST|Sakshi

వర్ధమాన లీడర్ల జాబితాలో చోటు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన టైమ్‌100 నెక్ట్స్‌ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తనయుడు, జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్‌ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్‌ మ్యాగజైన్‌ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్‌ అంబానీయే.

ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్‌ కూడా జాబితాలో ఉన్నారు. జూనియర్‌ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్‌గా ఇటీవల జూన్‌లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్‌ పేర్కొంది.

‘గూగుల్, ఫేస్‌బుక్‌ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్‌ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది. మరోవైపు, అడల్ట్‌ కంటెంట్‌ క్రియేటర్ల సైట్‌ అయిన ’ఓన్లీఫ్యాన్స్‌’కి ఆమ్రపాలి గాన్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో చీఫ్‌ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్‌ సింగర్‌ ఎస్‌జెడ్‌ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్‌ ప్లేయర్‌ కార్లోక్‌ అల్కెరాజ్‌ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు