ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం

28 Sep, 2021 19:48 IST|Sakshi

ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్‌'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్‌డీఓ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

"ఆకాశ్ ప్రైమ్ క్షిపణిలో మెరుగైన ఖచ్చితత్త్వం కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఒక అధికారి మీడియాతో పంచుకున్నారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), భారత సైన్యం, భారత వైమానిక దళం, ఇతర వాటాదారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థపై భారత సైన్యం, భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు. (చదవండి: నా కెరియర్‌లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల)

మరిన్ని వార్తలు