హైదరాబాద్‌లో అక్షయకల్ప భారీ పెట్టుబడులు

17 May, 2023 08:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప స్థానిక అవసరాల కోసం పాల సేకరణకు సంబంధించి హైదరాబాద్‌ సమీపంలోని అప్పాజీగూడలో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనిపై రూ. 20–30 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు శశి కుమార్‌ తెలిపారు.

మూడేళ్లలో ఇది అందుబాటులోకి రాగలదని, తొలుత రోజుకు 10వేల లీటర్ల వరకు పాల సేకరణ ఉండగలదని వివరించారు. ప్రస్తుతం తమకు కర్ణాటక, తమిళనాడులో చెరో క్లస్టర్‌ ఉందని చెప్పారు. ఒక్కో క్లస్టర్‌లో సుమారు 300–400 మంది పాడి రైతులు ఉంటారు.  బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో నెలకు సుమారు రూ. 20 కోట్ల వరకు అమ్మకాలు ఉంటున్నాయని శశి కుమార్‌ తెలిపారు. కొత్తగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ‘గ్రీన్స్‌’ పేరిట సేంద్రియ కూరగాయలు, పండ్ల విక్రయాలు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో దాదాపు 180 మంది, మొత్తం మీద సుమారు 800 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 205 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 300 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శశి కుమార్‌ పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటు చేసినప్పట్నుంచి దాదాపు దశాబ్దకాలంలో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు