వెహికల్స్‌ను క్లీన్‌ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా?

4 Dec, 2022 07:17 IST|Sakshi

పెద్ద పెద్ద ఇళ్లల్లో గచ్చును శుభ్రం చేయడానికి, వాహనాలను శుభ్రం చేయడానికి వాషర్లు తప్పనిసరి. ఇప్పటి వరకు విరివిగా వాడుకలో ఉన్న వాషర్లన్నీ విద్యుత్తు సాయంతో పనిచేసేవే! ఇవి కాస్త భారీగా కూడా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తరలించాలంటే కష్టమే! పైగా ఆరుబయట ఉన్న వాహనాన్ని శుభ్రం చేయాలంటే, ఇంట్లో ఉన్న ప్లగ్‌ సాకెట్‌ నుంచి ఆరుబయట ఉన్న వాహనం వరకు సరిపోయే పొడవాటి తీగ కావాల్సి ఉంటుంది. 

ఫొటోలో కనిపిస్తున్న ‘ఆల్బో పోర్టబుల్‌ కార్డ్‌లెస్‌ ప్రెషర్‌ వాషర్‌’కు అంత పటాటోపం ఏమీ అక్కర్లేదు. ఇది పూర్తిగా రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. విద్యుత్‌ వాషర్లకంటే ఇది తేలిక కూడా. దీని బరువు ఆరుకిలోలే! పైగా దీని అడుగున అమర్చిన చక్రాల వల్ల దీనిని ఎక్కడికైనా సులువుగా నడిపించుకుంటూ పోవచ్చు. దీని సిలిండర్‌లో నీళ్లు నింపుకొని, స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే చాలు.

ఇందులోని బ్యాటరీ విడుదల చేసే 55 బార్ల ప్రెషర్‌ ధాటికి ఎంతగా మురికిపట్టిన గచ్చయినా, వాహనాలైనా ఇట్టే శుభ్రమైపోతాయి. అమెరికన్‌ కంపెనీ ‘ఆల్బో’ రూపొందించిన ఈ పోర్టబుల్‌ ప్రెషర్‌ వాషర్‌ ఈ ఏడాదికి రెడ్‌ డాట్‌ డిజైన్‌ అవార్డు కూడా అందుకుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,355) మాత్రమే! ప్రస్తుతం ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది.

మరిన్ని వార్తలు