ఐపీఓ... వాటాదారుల అనుమతి బాటలో పేటీఎం

21 Jun, 2021 11:51 IST|Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న పేటీఎం తాజా ఈక్విటీ జారీకి వచ్చే నెలలో వాటాదారుల అనుమతిని కోరనుంది. తద్వారా రూ. 12,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ను పొందాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సర్వీసుల సంస్థ జులై 12న అసాధారణ సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈజీఎంలో భాగంగా విజయ్‌ శేఖర్‌కున్న ప్రమోటర్‌ గుర్తింపు రద్దు అంశాన్ని సైతం చేపట్టనుంది.

శేఖర్‌ పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వాటాదారు సంస్థలు సైతం ఐపీవోలో ఈక్విటీని విక్రయించేందుకు అనుమతిని కోరనున్నట్లు పేటీఎం తెలియజేసింది. పేటీఎంలో 29.71 శాతం వాటాతో యాంట్‌ గ్రూప్‌(అలీబాబా) అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ బాటలో సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ రూ. 19.63 శాతం, సైఫ్‌ పార్టనర్స్‌ 18.56 శాతం, విజయ్‌ శేఖర్‌ శర్మ 14.67% చొప్పున వాటాలు కలిగి ఉంది.  

మరిన్ని వార్తలు