అప్పుడు చైనాపై రెచ్చిపోయి..! ఇప్పుడు ష్‌.. గప్‌చుప్‌

13 Oct, 2021 07:51 IST|Sakshi

Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. 


కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్‌ జాక్‌ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్‌ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్‌ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్‌ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్‌ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!)  బ్రేకులు పడ్డాయి.

 

అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్‌ వేదిక వద్ద జాక్‌ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్‌ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. 

ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్‌ ఫైనాన్షియల్‌ హబ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న జాక్‌ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్‌ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు  చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్‌ చేశాడు. డ్రాగన్‌ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్‌ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ది బాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్‌ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి.

యాభై ఏడేళ్ల జాక్‌ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్‌ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్‌ మా.. గతంలో ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్‌జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్‌ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది.

చదవండి:  బిట్‌కాయిన్‌.. చైనా బ్యాన్‌ ఎఫెక్ట్‌ నిల్‌!

మరిన్ని వార్తలు