నయా బ్యాం‘కింగ్‌’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..

20 Sep, 2021 00:41 IST|Sakshi

ఫిన్‌టెక్‌ సంస్థల కొత్త సేవలు 

సంప్రదాయ బ్యాంకులతో భాగస్వామ్యం 

సేవింగ్స్‌ ఖాతాలు, ఎఫ్‌డీలు, కార్డులు, రుణాల మంజూరు 

వేగవంతమైన సేవలు.. సౌకర్యవంతమైన ప్లాట్‌ఫామ్‌లు 

యువతరాన్ని ఆకర్షించే ఉత్పత్తులు

ఆధునిక, డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్‌ కావొచ్చు.. నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు. డీమోనిటైజేషన్‌ తర్వాత నుంచి దేశంలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది.

ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్‌ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది.

కొంచెం ప్రత్యేకంగా.. 
నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్‌ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత.

వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్‌ యాక్విజిషన్‌ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. 

కస్టమర్లకు సౌకర్యం.. 
సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్‌ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి.

వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్‌ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు.

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్‌ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్‌ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్‌ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్‌ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి.

సేవింగ్స్‌ ఆధారితం.. 
సేవింగ్స్‌ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్‌ చేస్తుంటాయి. ఐఎంపీఎస్‌/నెఫ్ట్‌/ఆర్‌టీజీఎస్‌/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్‌ బుక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్‌ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్‌ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు.

లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్‌ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్‌ డిపాజిట్‌ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. 

కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. 
నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్‌ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్‌ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్‌ బ్యాంకు సహకారంతో గూగుల్‌ పే ‘ఎఫ్‌ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్‌ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్‌ స్విగ్గీ లేదా అమెజాన్‌ నుంచి ఆర్డర్‌ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది.

మరో నియోబ్యాంకు ‘జూపిటర్‌ మనీ’ మనీ మేనేజ్‌మెంట్‌ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్‌ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్‌ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి.

నియోక్స్‌ అనే నియోబ్యాంకు మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్‌ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్‌.. మ్యూచువల్‌ ఫండ్స్, ఎఫ్‌డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్‌లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు.

బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్‌ ఫోన్‌ నుంచే బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్‌ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్‌లైన్‌ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్‌ ప్లస్‌ కథనమే ఇది...

రుణ ఉత్పత్తులు..  
కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్‌ చేస్తుంటాయి. ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్‌ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్‌లైన్‌లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్‌.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది.

నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్‌బీఎఫ్‌సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు.

సేవింగ్స్‌ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్‌ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్‌ ఖాతా సేవలను ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్‌వెస్ట్‌ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్‌బీఎల్‌ బ్యాంకుతో టైఅప్‌ అయ్యి క్రెడిట్‌ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్‌ స్కోర్‌ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్‌లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి.  

నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం 
నియో బ్యాంకులపై ఆర్‌బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్‌ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి.

కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్‌ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్‌బీఐ సాచెట్‌ వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసుకోవచ్చు. 

అనుకూలమేనా..? 
వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్‌ వెంటనే అప్‌డేట్‌ కావడం లేదని.. కస్టమర్‌ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. 

సైబర్‌ భద్రతా రిస్క్‌ 
అంతా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్‌ భద్రతా రిస్క్‌ ఉంటుంది. అలాగే, ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం.

అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్‌ చేస్తున్న ఎస్‌బీఐ యోనో, కోటక్‌ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు.

పరిమితులు 
సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్‌ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్‌ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌
కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 730     టార్గెట్‌: రూ. 870 
ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ దేశీ బ్రోకింగ్‌ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో యాక్టివ్‌ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్‌ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్‌ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది.

కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్‌ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్‌ పరిశ్రమలో డిజిటల్‌ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్‌ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్‌ షేర్ల మానిటైజేషన్‌ తదితర డైవర్సిఫైడ్‌ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది.

టీసీపీఎల్‌ ప్యాకేజింగ్‌
వెంచురా సెక్యూరిటీస్‌
కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 532     టార్గెట్‌: రూ. 961 
ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్‌ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్‌ కార్టన్స్‌), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్‌ పేపర్‌ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్‌ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది.

అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్‌ మార్కెట్‌ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్‌ డాలర్ల నుంచి 469 బిలియన్‌ డాలర్లకు జంప్‌చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్‌ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్‌ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్‌ ప్యాకేజింగ్‌ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్‌ బ్లోన్‌ఫిల్మ్‌ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. 

మరిన్ని వార్తలు