-

ENVO UPT: దీని అవతారాలు అన్ని... ఇన్నీ కావు!

27 Nov, 2023 13:42 IST|Sakshi

టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ ప్రపంచం కొత్త రంగులు పులుముకుంటోంది. ఈ రోజు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ ఒకప్పుడు ఇలా ఉండేది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్‌ఫోన్‌ అని మాత్రమే కాకుండా కంప్యూటర్, కెమరా, వాహనాలు ఇతరత్రా అన్నీ కూడా అనేక పరిణామాలు చెందుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికికల్ తయారవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఎన్వో (ENVO) డ్రైవ్ సిస్టమ్స్ ప్రోటోటైప్ రూపంలో ఒక 'యుటిలిటీ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్'ను అభివృద్ధి చేస్తోంది. ఇది చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు.

కంపెనీ ఈ సింపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'వీమో వెలోమొబైల్‌'ను ఇటీవలే ప్రదర్శించింది. ఇది కంపెనీ ఒకటైన e-ATVని పోలి ఉంటుంది. ఈ వాహనాలను వినియోగదారుడు తనకి తగిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటిని ఆపరేట్ చేయాలంటే వినియోగదారుడు నిలబడితే సరిపోతుంది. అయితే దీనికి డిటాచబుల్ లేదా ఫోల్డబుల్ సీటుని అమర్చుకోవచ్చు. ఆ సమయంలో కూర్చుని ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.

ఈ వాహనాలను మినీ ట్రక్, గోల్ఫ్ కార్ట్, పవర్డ్ కార్గో డాలీ, రైడ్ ఆన్ లాన్ మూవర్, స్నో ప్లాఫ్, లిట్టర్ క్యారీయింగ్ బ్యాక్‌కంట్రీ రెస్క్యూ వంటి వాహనాల మాదిరిగా మాత్రమే కాకుండా.. పూర్తిగా క్లోజ్ చేసి ఒక మైక్రో కారు మాదిరిగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే వినియోగదారుడు ఈ వాహనాన్ని తన అవసరానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతోంది.

ఈ ఎలక్ట్రిక్ వాహనాలు 3-కిలోవాట్ ఇన్-వీల్ మోటార్లు, డెక్ లోపల ఎనిమిది రిమూవబుల్ బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో 12 కిలోవాట్ బ్యాటరీ ఒక చార్జ్‌తో గరిష్టంగా 100 నుంచి 200 కిమీ పరిధిని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిమీ కాగా.. 640 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి సుమారు 250 నుంచి 350 కేజీల బరువును లాగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను 2025 డిసెంబర్ నాటికి డెలివరీలను చేయనున్నట్లు సమాచారం, అంత కంటే ముందు బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. ఈ వెహికల్స్ బేస్ మోడల్ ధరలు 14,000 డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 10 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.

Images Source

మరిన్ని వార్తలు