కొంటే ఖర్సయిపోతారు..!

18 Apr, 2022 00:41 IST|Sakshi

ఊరిస్తున్న బీఎన్‌పీఎల్‌ రుణాలు

15–30 రోజుల చెల్లింపుల గడువు

అప్పటి వరకు వడ్డీ ఉండదు

తేడా వస్తే భారీగా బాదుడు

నిర్లక్ష్యం వహిస్తే క్రెడిట్‌ స్కోరుకు చిల్లు

క్రెడిట్‌ కార్డుకు ప్రత్యామ్నాయం కాదు...

ఆన్‌లైన్‌ షాపింగ్‌. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..?
అదే బై నౌ పే లేటర్‌. లేదా స్పెండ్‌ నౌ పే లేటర్‌. అమెజాన్‌ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వరకు క్రెడిట్‌ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే.  
   
బీఎన్‌పీఎల్‌ రూపంలో లభించే క్రెడిట్‌ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్‌ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.   
  ∙
బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్‌ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్‌ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్‌ సంస్థలు బీఎన్‌పీఎల్‌ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్‌ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్‌ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్‌ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి.   
  ∙
ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్‌/బీఎన్‌పీఎల్‌) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్‌ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ కామర్స్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్‌ నంబర్‌ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది.

చార్జీలు/ఫీజులు
15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్‌. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్‌ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్‌ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్‌ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి.

బీఎన్‌పీఎల్‌ సంస్థలు
ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్‌ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్‌ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

రుణ సదుపాయం
ఆన్‌లైన్‌లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్‌ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్‌సెక్యూర్డ్‌ రుణం. దీంతో ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్‌ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్‌ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్‌లైన్‌) ఉంటుంది. స్మాల్‌ టికెట్‌ లోన్స్‌గా చెబుతారు.

పేమెంట్‌ ఆప్షన్‌ పేజీలో బీఎన్‌పీఎల్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్‌ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్‌ అయితే అది మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్‌ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్‌సెక్యూర్డ్‌ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

బీఎన్‌పీఎల్‌ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్‌బీఎఫ్‌సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్‌ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్‌ బీఎన్‌పీఎల్‌ అన్నది అమెజాన్‌ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌/ఈకామర్స్‌ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు.

చెల్లింపుల్లో విఫలమైతే..
మొదట లేట్‌ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్‌ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్‌ పే లేటర్‌ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది.

జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్‌ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్‌ డీలింక్వెన్సీగా క్రెడిట్‌ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్‌ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. 

కస్టమర్‌ రిజిస్టర్‌ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్‌ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్‌ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్‌ కోసం బీఎన్‌పీఎల్‌ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్‌ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్‌ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది.

యాక్టివేట్‌ అయినట్టే..
శ్రీరామ్‌ ఏప్రిల్‌ నెల క్రెడిట్‌ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్‌ ఫ్లోట్, కరూర్‌ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్‌ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్‌ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్‌ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్‌ పే లేటర్‌ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్‌ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్‌ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్‌ సదుపాయాన్ని యాక్టివేస్‌ చేసేసింది సదరు సంస్థ.

ఇది శ్రీరామ్‌ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్‌లైన్‌ కోసం సైనప్‌ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్‌లైన్‌ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్‌ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్‌ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్‌ జాగ్రత్త.

>
మరిన్ని వార్తలు