మహీంద్రా నుంచి ₹17 కోట్ల ఎలక్ట్రిక్ సూపర్ ఫాస్ట్ కారు

9 Aug, 2021 19:34 IST|Sakshi

దేశీయ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2015లో ఇటాలియన్ ఆటోమొబిలి కంపెనీ పినిన్ఫరీనాను కొనుగోలు చేసింది. ఫెరారీ, మసెరాటి, రోల్స్ రాయిస్, ఆల్ఫా రోమియో, కాడిలాక్ వంటి ఉత్తమ బ్రాండ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైనింగ్ కంపెనీకి $185 మిలియన్లు(సుమారు ₹1,240 కోట్లు) చెల్లించి ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) పేరును కంపెనీ వ్యవస్థాపకుడు బాటిస్టా పినిన్ఫరీనాకు నివాళిగా పెట్టారు.

సింగిల్ చార్జ్ తో 450 కి.మీ ప్రయాణం
బాటిస్టాను ఆవిష్కరించిన రెండు సంవత్సరాల తర్వాత పినిన్ఫరీనా ఆగస్టు 12 - ఆగస్టు 15 మధ్య జరగబోయే మాంటెరీ కార్ వీక్(యుఎస్)లో బాటిస్టా హైపర్ జీటీని అధికారికంగా సంస్థ ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ప్రతి చక్రం వద్ద నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లును అమర్చారు. దీని వల్ల మొత్తం 1,400కెడబ్ల్యు(కిలోవాట్) శక్తి బయటకు వస్తుంది. ఇది 1,900 హార్స్ పవర్(బిహెచ్ పీ)కు సమానం. ఇది 120 కిలోవాట్-అవర్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. అయితే, ప్రముఖ టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ లలో 100 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఈ కారు 2,300 ఎన్ఎమ్(న్యూటన్ మీటర్లు) టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
 

కేవలం 2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతే కాదు, ఇది గరిష్టంగా 350 కిలోమీటర్ల(217 మైళ్ళు) వేగాన్ని అందుకోనుంది. అనేక ఇంధన ఆధారిత సూపర్ కార్ల కంటే దీని వేగం ఎక్కువ. ఉదాహరణకు, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ గంటకు 340 కిలోమీటర్లు (211 మైళ్ళు) అధిక వేగంతో వెళ్ళగలదు. బాటిస్టాను ఒకేసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్లు(280 మైళ్ళు) వెళ్లగలదు అని సంస్థ పేర్కొంది. దీనిలో ఆకట్టుకునే ఇంటీరియర్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రిక్ లగ్జరీ కారు కాబట్టి ఇందులో క్విల్టెడ్ సీట్లు, మూడు డ్రైవర్ సైడ్ స్క్రీన్లు, ప్రీమియం డ్యాష్ బోర్డ్ తో వస్తుంది.
 

బాటిస్టా పరిమిత ఎడిషన్ మోడల్
పినిన్ఫరీనా బాటిస్టా 2022 ప్రారంభంలో అమ్మకానికి రానుంది.  దీని ధర $2.2 మిలియన్లకు పైగా (సుమారు ₹17 కోట్లు) ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఇంకా భారతదేశంలో ఈ కారు గురుంచి ప్రణాళికలను ధృవీకరించలేదు, కానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిష్ షా మాట్లాడుతూ.. దేశంలోకి తీసుకొనిరావడానికి వ్యూహాన్ని రచిస్తున్నట్లు పేర్కొన్నారు. బటిస్టా ఉదాహరణను ఇస్తూ.. భారతదేశం వెలుపల మహీంద్రా ఈవి టెక్ గొప్పదని, ఇది త్వరలో భారతదేశానికి వస్తుందని ఆయన అన్నారు. బాటిస్టా పరిమిత ఎడిషన్ మోడల్ అని, కేవలం 125 మోడల్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆటోమొబిలి పినిన్ఫరీనా చీఫ్ ఇంతకు ముందు 150 మోడల్స్ తయారు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు