ఆల్‌కార్గో- ఎల్‌ఐసీ హౌసింగ్‌.. యమస్పీడ్‌

25 Aug, 2020 11:24 IST|Sakshi

డీలిస్టింగ్ ప్రతిపాదన

ఆల్‌కార్గో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

11 శాతం దూసుకెళ్లిన ఎల్‌ఐసీ హౌసింగ్‌

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి ఖంగుతిన్నాయి. తొలుత 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం నష్టాలతో కదులుతోంది. 70 పాయింట్లు క్షీణించి 38,729కు చేరింది. నిఫ్టీ సైతం 18 పాయింట్లు తక్కువగా 11,448 వద్ద ట్రేడవుతోంది. కాగా.. స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీని డీలిస్ట్‌ చేయనున్న వార్తలతో ప్రయివేట్‌ రంగ కంపెనీ ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్‌ కంపెనీ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌
స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్‌ చేసేందుకు ప్రమోటర్‌ గ్రూప్‌ ప్రణాళికలు వేస్తున్నట్లు ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ తాజాగా వెల్లడించింది. ప్రమోటర్‌ శశి కిరణ్‌ శెట్టితోపాటు.. టాలెంటోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి కంపెనీని స్వచ్చందంగా డీలిస్ట్‌ చేసేందుకు వీలుగా ప్రమోటర్లు పబ్లిక్‌ వాటాదారుల నుంచి ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్‌ గ్రూప్‌నకు 70 శాతంపైగా వాటా ఉంది. దీంతో ఈ కౌంటర్‌లో కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువయ్యారు. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఆల్‌కార్గో షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22 ఎగసి రూ. 131 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 817 కోట్లను తాకింది. ప్రొవిజన్లు రూ. 253 కోట్ల నుంచి రూ. 56 కోట్లకు తగ్గడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు 2.41 శాతం నుంచి 2.32 శాతానికి స్వల్పంగా నీరసించాయి. మొత్తం ఆదాయం రూ. 4807 కోట్ల నుంచి రూ. 4977 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 309ను తాకింది. ప్రస్తుతం 8.3 శాతం లాభంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు