ఇక ఎలక్ట్రిక్‌ వాహనదారుల ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..!

11 Jan, 2022 21:20 IST|Sakshi

రెండేళ్లలో 25 వేల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు 

ముంబై: ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ ఆల్టిగ్రీన్, విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ సొల్యూషన్స్‌ స్టార్టప్‌ సంస్థ మాసివ్‌ మొబిలిటీ చేతులు కలిపాయి. వచ్చే రెండేళ్లలో 25,000 ఆన్‌-డిమాండ్‌ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. మాసివ్‌ మొబిలిటీకి ప్రస్తుతం ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతంలోని (ఎన్‌సీఆర్‌) 150 ప్రదేశాల్లో చార్జర్లు ఉన్నాయి. ఆల్టిగ్రీన్‌తో ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో చార్జింగ్‌ స్టేషన్‌లు నెలకొల్పనుంది.

బ్రాండ్, మోడల్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలను చార్జింగ్‌ చేసుకునేందుకు అనువుగా ఇవి ఉంటాయి. యూజర్లు తమ ప్రొఫైల్‌ను ఆన్‌లైన్‌లో సెట్‌ చేసుకుని, చార్జింగ్‌ స్టేషన్లలో స్లాట్లను బుక్‌ చేసుకోవడం, యూపీఐ విధానంలో చెల్లింపులు జరపడం మొదలైన లావాదేవీలు కూడా చేసేందుకు తమ చార్జింగ్‌ యాప్‌ ఉపయోగపడుతుందని మాసివ్‌ మొబిలిటీ వ్యవస్థాపకుడు శైలేష్‌ విక్రం సింగ్‌ తెలిపారు. చార్జింగ్‌ సదుపాయాలు భారీ స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింత పెరగగలదని ఆల్టిగ్రీన్‌ సీఈవో అమితాబ్‌ శరణ్‌ పేర్కొన్నారు.

(చదవండి: OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన వన్‌ప్లస్ సూపర్ స్మార్ట్‌ఫోన్..!)

మరిన్ని వార్తలు