AI Camera: పవర్‌ఫుల్‌ కళ్లు.. ఇక కారులో ఎలాంటి వేషాలు కుదరవు!!

23 Sep, 2021 08:55 IST|Sakshi

సరదాగా కారులో పోయేప్పుడు.. ఉల్లాసం కోసం ఫుల్‌ సౌండ్‌లో రేడియో వింటాం. సరదాగా బయటకు తొంగి చూస్తుంటాం.  ఒక్కోసారి హడావిడిలో సిగ్నల్‌ జంప్‌ కొట్టి పోతాం. దారినపోయే వెహికిల్స్‌కు కట్టింగ్‌లు కొడతాం.  ఓ..  ఇంకా చాలా పనులు చేస్తాం.   ఇదంతా వ్యక్తిగతంగా ఫీలవుతుంటారు చాలామంది. అయితే ఆ వ్యక్తిగతంపై నిఘా నీడలు అలుముకుంటే?.. యస్‌.. అలాంటి పవర్‌ఫుల్‌ కెమెరాలు సమీప భవిష్యత్తులో మనదగ్గరికీ రాబోతున్నాయి. 


తన డెలివరీ వ్యవస్థను పటిష్టపర్చుకునేందుకు కొత్త తరహా కెమెరా నిఘా వ్యవస్థను తీసుకొచ్చింది అమెజాన్‌.  ఆన్‌లైన్‌ సేల్స్‌, గూడ్స్ డెలివరీ సర్వీసుల్లో భాగంగా డెలివరీ వెహికిల్స్‌లో ‘నెట్రాడైన్‌ కెమెరాల’ను ఉపయోగిస్తోంది అమెజాన్‌. డెలివరీ బాయ్స్‌ మీద నిఘా, భద్రత దృష్ట్యా త్వరలో వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలని అమెజాన్‌ భావిస్తోంది. పూర్తి అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పని చేసే ఈ కెమెరాలు.. ప్రతీది నిశితంగా పరిశీలిస్తాయి. నాలుగు లెన్స్‌ల ఈ కెమెరాలు ముందుగా డెలివరీ డ్రైవర్‌ ముఖాన్ని, బాడీని స్కాన్‌ చేసుకుని ఆ బయోమెట్రిక్‌ డేటా ద్వారా షిఫ్ట్‌లో ఉన్నంతసేపు పర్యవేక్షిస్తుంటుంది.

డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్నారా? రోడ్లపై సరిగా వెళ్తున్నారా? సమయానికి డెలివరీలు అందిస్తున్నారా? ఇలా.. ప్రతీది చూస్తుంటాయి. పైగా  ఈ కెమెరాల ద్వారానే డ్రైవర్ల పనితీరుపై ఓ అంచనాకి రావడం, బోనస్‌లు, ఇతరత్రా నజరాల్ని ప్రకటిస్తున్నారు. అయితే..

డ్రైవర్ల ఆవేదన
ఈ హైస్టాండర్డ్‌ కెమెరాల వల్ల తాము శిక్షకు గురికావాల్సి వస్తోందని కొందరు డెలివరీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  నిరంతర పర్యవేక్షణ వల్ల సమయానికి డెలివరీలు చేయలేకపోతున్నామని, తద్వారా జీతంలో కోతలు.. పనితీరు సరిగా లేదనే నోటీసులు అందుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.  చివరికి డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ‘ఆవులించినా సరే’.. సదరు ఉద్యోగికి నెగెటివ్‌ పాయింట్స్‌ పడుతున్నాయట. 

అయితే అమెజాన్‌ మాత్రం  ‘ఏఐ కెమెరా’ చర్యలను సమర్థించుకుంటోంది. 48 శాతం యాక్సిడెంట్‌లు తగ్గాయని, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు 77 శాతం తగ్గాయని చెబుతోంది. సీట్‌ బెల్ట్‌ ఛలానాలు, నిర్లక్క్ష్యపు డ్రైవింగ్‌ ఉదంతాలు సైతం తగ్గినట్లు చెబుతోంది.

చదవండి: ఇదేం అమ్మాయి.. ఈ భూమ్మీద ఎక్కడా చూసి ఉండరు!!

మరిన్ని వార్తలు