అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిళ్ల వీడియో: మండిపడుతున్న యూజర్లు

29 Aug, 2022 13:23 IST|Sakshi

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిళ్ల వీడియో  వైరల్‌ 

సాక్షి,ముంబై: ఆన్‌లైన్‌ రీటైల్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు సోషల్‌మీడియాలో మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచాయి. వీటి ఆన్‌లైన్‌ డెలివరీ పార్సిల్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.  ఈ వీడియో చూసిన యూజర్లు  అయ్యో.. నా పార్సిల్‌ .. నా  ఫోన్‌, నా ల్యాప్‌టాప్‌  అంటూ  గుండెలు బాదుకుంటున్నారు.  దీంతో రీట్వీట్టు, కమెంట్లతో హోరెత్తి పోతోంది. 

విషయం ఏమిటంటే.. రైలు బోగీలోంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిల్స్‌ను, ప్యాకెట్ల,అట్టపెట్టెలను అన్‌లోడింగ్‌ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్‌లో తెగ షేర్‌ అవుతోంది. నిర్లక్క్ష్యంగా, కనీస జాగ్రత్త లేకుండా వాటిని విసిరి పారేస్తున్న వైనం వినియోగదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందుకేనా మా దగ్గర అదనంగా 29 రూపాయలు అప్పనంగా  వసూలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు.  రకరకాల కమెంట్స్ ట్విటర్‌లో  వైరలవుతున్నాయి.

‘3 లక్షల రూపాయల విలువైన నా ఆసుస్‌ గేమింగ్ ల్యాప్‌టాప్ అందులోనే ఉందనుకుంటా’ గోవిందా అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, ఖాళీ పెట్టెల్లాగా  అలా విసిరేస్తున్నారేంటిరా బాబూ అని మరొకరు, ఇక ఇవాల్టితో ఆన్‌లైన్‌ షాపింగ్‌ బంద్‌ ఇంకొకరు కమెంట్‌ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ సమయంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే వీడియోపై అటు అమెజాన్‌గానీ, ఇటు ఫ్లిప్‌కార్ట్‌కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు