వొడాఫోన్‌కు అమెజాన్, వెరిజాన్‌ దన్ను!

4 Sep, 2020 04:31 IST|Sakshi

4 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం

పెట్టుబడులపై చర్చల పునరుద్ధరణ

నిధుల సమీకరణపై నేడు వొడా ఐడియా బోర్డు సమావేశం

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కిందా మీదా పడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాలో ఇన్వెస్ట్‌ చేయడంపై అంతర్జాతీయ దిగ్గజాలు అమెజాన్, వెరిజాన్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో నిలిపివేసిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించినట్లు సమాచారం. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బాకీలు చెల్లించడానికి టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు పదేళ్ల వ్యవధి ఇవ్వడం.. వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌)లో పెట్టుబడులపై చర్చలను పునరుద్ధరించడానికి తోడ్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సుమారు 4 బిలియన్‌ డాలర్ల మేర అమెజాన్, వెరిజాన్‌ ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిధుల కొరతతో నానాతంటా లు పడుతున్న వొడా ఐడియాకు ఈ పెట్టుబడులు లభిస్తే ఇప్పటిదాకా నిల్చిపోయిన నెట్‌వర్క్‌ అప్‌గ్రేడింగ్‌ పనులు తిరిగి ప్రారంభించుకోవచ్చు. అలాగే ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలను కూడా కట్టేందుకు కాస్త తోడ్పాటు లభించవచ్చు. నిధుల సమీకరణ అంశంపై వొడాఫోన్‌ ఐడియా బోర్డు సెప్టెంబర్‌ 4న (శుక్రవారం) సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దాదాపు 50,000 కోట్ల మేర ఏజీఆర్‌ బాకీలు
జియో చౌక ఆఫర్ల ధాటికి తట్టుకోలేక పోటీ టెల్కోలు కుదేలైన సంగతి తెలిసిందే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాల ప్రకారం .. మే నెలలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా యూజర్ల సంఖ్య చెరి 47 లక్షలకు పైగా తగ్గిపోగా.. జియో యూజర్ల సంఖ్య మాత్రం 37 లక్షల మేర పెరిగింది. ప్రత్యర్థి సంస్థలతో పోటీతో పాటు ఏజీఆర్‌ బాకీల భారం కూడా తోడవడంతో వొడాఫోన్‌ ఐడియా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టెలికం సంస్థల్లో అత్యధికంగా ఈ కంపెనీయే కేంద్రానికి బాకీలు కట్టాల్సి ఉంది.

ఏజీఆర్‌ లెక్కల ప్రకారం వొడాఫోన్‌ ఐడియా ఇంకా రూ. 50,000 కోట్లకు పైగా స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలు కట్టాల్సి ఉందని అంచనా. కంపెనీ ఇప్పటిదాకా రూ. 7,854 కోట్లు కట్టింది. జూన్‌ క్వార్టర్‌లో బాకీల కింద ప్రొవిజనింగ్‌ చేయడం, వన్‌ టైమ్‌ చార్జీలను లెక్కించాల్సి రావడంతో జూన్‌ త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల మేర నష్టాలను నమోదు చేసింది. ఏజీఆర్‌ బాకీల కారణంగా వొడాఫోన్‌ ఐడియాలో పెట్టుబడులపై చర్చల విషయంలో అనిశ్చితి నెలకొంది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల కారణంగా కాస్త స్పష్టత రావడంతో అమెజాన్, వెరిజాన్‌ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

షేరు రయ్‌..
అమెజాన్, వెరిజాన్‌ పెట్టుబడుల వార్తలతో వొడాఫోన్‌ ఐడియా షేరు గురువారం  ఏకంగా 30% ఎగిసింది. బీఎస్‌ఈలో సుమారు 27% పెరిగి రూ. 12.56 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 29.96 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 12.88 రేటును కూడా తాకింది.

గతంలో గూగుల్‌ కూడా ఆసక్తి
టెక్‌ దిగ్గజం గూగుల్‌.. వొడాఫోన్‌ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయనుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, దాని పోటీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో (రిలయన్స్‌ గ్రూప్‌లో భాగం) 4.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకుంది. జియో, ఫేస్‌బుక్, గూగుల్‌ కలవడం వల్ల ప్రత్యర్థి సంస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని టెక్నాలజీ, టెలికం రంగాల విశ్లేషకులు భావిస్తున్నారు. జియోతో ప్రతీ విషయంలో పోటీపడలేకపోయినప్పటికీ టెలిఫోన్‌ సర్వీసులకు మించి కొంగొత్త ఉత్పత్తులు, సేవలు అందించడంపై వొడాఫోన్‌ ఐడియా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గతంలో కూడా పలు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ కార్యక్రమాల కోసం అమెజాన్‌తో వొడాఫోన్‌ ఐడియా చేతులు కలిపింది. అమెరికన్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజమైన అమెజాన్‌కు భారత్‌లో గణనీయ స్థాయిలో కార్యకలాపాలు ఉన్నాయి. ఇక అమెరికాకే చెందిన టెలికం దిగ్గజం వెరిజాన్‌ .. తన మీడియా, ఆన్‌లైన్‌ విభాగం ఓత్‌ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. మరో దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో వెరిజాన్‌ పలు అంశాలపై చేతులు కలిపింది. ఇటీవలే వెరిజాన్‌ భాగస్వామ్యంతో వ్యాపార రంగ కస్టమర్ల కోసం బ్లూజీన్స్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ను భారత్‌లో ఆవిష్కరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు