Jeff Bezos And Elon Musk : శాటిలైట్‌ ఇంటర్నెట్‌, పోటీపడుతున్న జెఫ్‌బెజోస్‌, ఎలన్‌ మస్క్‌

8 Nov, 2021 20:18 IST|Sakshi

స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌లు భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆర్టెమిస్‌ ప్రాజెక్టులో భాగంగా లూనార్‌ ల్యాండర్‌ ప్రాజెక్ట్‌ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ విఫలమయ్యారు. తాజాగా స‍్పేస్‌లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ విషయంలో మస్క్‌ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్‌బెజోస్‌ సైతం 'ప్రాజెక్ట్ కైప‌ర్' పేరుతో  శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్‌లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు.  

జెఫ్‌బెజోస్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే 4,500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను (శాటిలైట్స్‌) స్పేస్‌లోకి పంపేందుకు యూఎస్‌ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్‌ నుండి అనుమతి పొందారు. తాజాగా గత వారం మరో 7,774 ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపేందుకు, నవంబర్‌ 7న (నిన్న ఆదివారం) అమెజాన్ 2022 చివరి నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎఫ్‌సీసీని అనుమతి కోరారు. 

ఈ అనుమతులతో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వినియోగదారులందరికి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించవచ్చని ఎఫ్‌సీసీ అనుమతి కోసం పంపిన నివేదికలో జెఫ్‌ బెజోస్‌ పేర్కొన్నారు. వరల్డ్‌ వైడ్‌గా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ మెరుగుపడినప్పటికీ ప్రపంచ జనాభాలో 51%, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో 44% మాత్రమే ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగిస్తున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది.  

స్పేస్‌ ఎక్స్‌ ముందంజ
స్పేస్‌ఎక్స్‌  యజమాని ఎలన్‌ మస్క్‌ శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవల కోసం ‘స్టార్‌ లింక్‌’ పేరుతో ప్రాజెక్ట్‌  ప్రారంభించారు. ప్రాజెక్ట్‌ లో భాగంగా  2027 నాటికల్లా  4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో  అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్‌ బుకింగ్‌(రిఫండబుల్‌) శాటిలైట్‌ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్‌ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్‌లింక్స్‌తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్‌స్టార్ట్‌ తో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ ‘వన్‌వెబ్‌’ పేరుతో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తున్నారు.

చదవండి:శుభవార్త..! 'జియో'కంటే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

మరిన్ని వార్తలు